తెలంగాణముఖ్యాoశాలు

తెలంగాణలో..మతోన్మాదమే బీజేపీ ఎజెండా….మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌

రాజాసింగ్‌ సస్పెన్షన్‌ కంటితుడుపు చర్య మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌

తెలంగాణలో..మతోన్మాదమే బీజేపీ ఎజెండా ప్రయత్నిస్తోందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఇందుకోసం మతకలహాలను.. రెండు వర్గాల మధ్య విభజనను సృష్టిస్తోందని దుయ్యబట్టింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ ఆదివారం ఓ లేఖను విడుదల చేశారు. కాంగ్రె్‌సకు రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి తన కాంట్రాక్టు వ్యాపారాల కోసమే బీజేపీలో చేరారని ఆరోపించారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలను విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామిక సంఘాలు వ్యతిరేకించాలన్నారు. బీజేపీని సమాధి చేసేందుకు ఆ పార్టీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన, లంచగొండి వల్లే తెలంగాణలో బీజేపీ ముందుకు వచ్చిందని ఆరోపించారు.బీజేపీ పాలనతో దేశం ఘోరమైన పరిస్థితికి దిగజారిందన్నారు. రాష్ట్రాన్ని గుజరాత్‌ తరహా ప్రయోగశాలగా ఉపయోగించుకోవడం బీజేపీ ఉద్దేశమని ఆరోపించారు. ‘‘భారతదేశాన్ని ఫాసిస్టు హిందూ రాజ్యంగా మార్చే ఎజెండాతో బీజేపీ తన యావత్‌ శక్తితో తెలంగాణపై కేంద్రీకరిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికను ఇందుకు రిహార్సల్స్‌గా వాడుకుంటోంది. భారత రాజకీయాల ఫాసిజీకరణ శిఖరాగ్రానికి చేరుకున్న తరుణంలో.. తెలంగాణ ఇప్పుడు నిర్ణయాత్మక బిందువు వద్దకు చేరుకుంది. రాజకీయాలు ఎన్నడూ భూస్వామ్య, దళారీ, బూర్జువా వర్గాల నుంచి ప్రజలను విముక్తి చేసే సాధనాలుగా లేవు. దోపిడీ పరిస్థితులను కొనసాగించేందుకే అవి పనిచేస్తాయి. మునుగోడు ఉప ఎన్నికను ఈ కోణంలోనే చూడాలి’’ అని ఆ లేఖలో తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన అవమానకర వ్యాఖ్య ముస్లిం సముదాయానికి బహిరంగ అవమానమని, ఇది వారి అస్థిత్వాన్నే నిరాకరిస్తుందన్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు ఓ కంటి తుడుపు చర్యగా పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌.. ఒకప్పుడు ఆ పార్టీని నిర్ణయాత్మకంగా సమర్థించిందని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker