పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనల విషయమై, ‘మా ప్రభుత్వం అలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెలవిచ్చారుగానీ, అది గతం.
చంద్రబాబు హయాంతో పోల్చితే, వైసీపీ సర్కారు పాలనలో ప్రకటనలు అనూహ్యంగా పోటెత్తుతున్నాయ్. బటన్ నొక్కిన ప్రతిసారీ, ఫుల్ పేజీ ప్రకటనలు పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఈ ప్రకటనలు వైసీపీ సొంత పత్రిక సాక్షికే వెళుతున్నట్లు గణాంకాలు చెబుతోన్న సంగతి తెలిసిందే.
అంటే, ఎవరు అధికారంలో వుంటే వాళ్ళు తమ అనుకూల మీడియా సంస్థల్ని పెంచి పోషించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అనుకోవాలా.? అలాగని సాధారణ ప్రజానీకంలో చర్చ జరుగుతోంది. సంక్షేమ పథకాల సంగతి తర్వాత, అసలంటూ ఈ పబ్లిసిటీ స్టంట్లకు మొత్తంగా ఎంత ఖర్చవుతోందన్నది తేలాల్సి వుంది. ఈ ప్రకటనల వల్ల ప్రజలకు నయా పైసా లాభం వుందా.? అన్నదానిపై చర్చ జరగాల్సి వుంది.
‘కోట్లకు కోట్లు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం తగలేస్తున్నారు..’ అని అప్పట్లో ఆరోపించి వైసీపీ, ఇప్పుడు చేస్తున్నదేంటి.? ‘నాడు చంద్రబాబు పాలనలో అలా, ఇప్పుడు జగన్ పాలనలో ఇలా..’ అనే అర్థం వచ్చేలా, పసుపు రంగు బాక్సులో ఒక కంటెంట్, బ్లూ కలర్ బాక్సులో ఇంకో కంటెంట్ వేస్తూ, ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పిస్తున్నారిప్పుడు.
మరి, రేప్పొద్దున్న కొత్త ప్రభుత్వం వస్తేనో.? మూడు బాక్సులతో కూడిన ప్రకటనలు వేసుకోవాల్సి వస్తుందన్నమాట. అప్పుడు, కొత్త ప్రభుత్వానికి అనుకూలంగా వుండే మీడియా సంస్థలకు ఇలాగే దోచి పెడితే, అప్పుడు వైసీపీ, టీడీపీ కలిసి చేసే విమర్శలు ఎలా వుంటాయో ఏమో.!
ఆయా పార్టీలకు అధికారాన్ని ప్రజలు కట్టబెట్టేది, ఆయా మీడియా సంస్థల్ని పెంచి పోషించడం కోసం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. రాజధానికి నిధులు వుండవ్‌గానీ.. పబ్లిసిటీ పైత్యం కోసమైతే బోల్డన్ని డబ్బులుంటాయా.? అని జనం సంధిస్తున్న ప్రశ్నకు వైసీపీ సర్కారు ఏం సమాధానం చెబుతుందో ఏమో.!
పాలన అంటే, ప్రజలకు జవాబుదారీతనం. మరి, ఈ పబ్లిసిటీ పైత్యం విషయంలో ప్రజలకు జవాబుదారీగా వున్నామని వైసీపీ చెప్పగలదా.?