పెళ్లికాని జంట ఒకే గదిలో ……

పెళ్లి కాని జంట ఒకే గదిలో ఉండటం నేరంగా పరిగణించలేమంటూ మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే తమిళనాట, కోయంబత్తూరులోని పోలీసులకు వ్యభిచారం జరుగుతోందంటూ సమాచారం అందటంతో ఓ లాడ్జిపై రైడింగ్ చేసిన పోలీసులకు ఓ గదిలో అవివాహిత జంట కనిపించడంతో అరెస్టు చేసింది. వీరి గదిలో మద్యం బాటిళ్లనీ స్వాదీనం చేసుకుని కేసు కట్టి, దీంతో ఆ లాడ్జిని అధికారులు సీజ్ చేశారు.
పోలీసులు పదే పదే తమ లాడ్జిపై దాడి చేయటం వల్ల తమ సంస్ధ పేరు ప్రఖ్యాతులు దెబ్బతీస్తోందని, అధికారుల చర్యలను సవాల్ చేస్తూ లాజ్జి యాజమాన్యం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎస్ రమేశ్ ధర్మాసనం.. అవివాహిత స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదనే చట్టం లేని నేపథ్యంలో అది ఎలా తప్పవుతుందని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు వయోజనులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో, అలాగే లాడ్జిలోని ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని స్పష్టం చేశారు.
తమిళనాడు మద్యపానచట్టం ప్రకారం ఓ వ్యక్తి వద్ద విదేశీ మద్యం లీటరు, ఏడు లీటర్ల బీరు, 9 లీటర్లు వైన్ కలిగి ఉండటానికి అనుమతి ఇచ్చిందన్నారు. అలాగే, ఆ హోటల్లో మద్యం సరఫరా చేయకపోయినా అతిథులే స్వయంగా కొనుగోలు చేసుకుంటారని దీన్ని నేరంగా ఎలా పరిగణించలేమని స్పష్టం చేసింది. మద్యం సీసాలు లభించడం ఆ లాడ్జిలో అక్రమంగా బార్ నిర్వహిస్తున్నారని చెప్పలేమని పేర్కొన్నారు. లాడ్జి మూసివేతలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదని, అందువల్ల సీలు తొలగించాలని కోయంబత్తూరు కలెక్టరును మద్రాసు హైకోర్టు ఆదేశించింది.


