ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

ఆగస్టు 23 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ ?

రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 23 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ కు పిలుపునిచ్చాయి. శనివారం బంద్‌ పోస్టర్‌ ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్‌ కార్యదర్శి గోపి నాయక్‌ మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్య రంగాన్ని పరిరక్షిస్తామని, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వాగ్దానం చేశారని.. మాటిచ్చిన సిఎం జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్‌ రెడ్డి తమపై ఉన్న కేసుల భయంతో ఆంధ్రప్రదేశ్‌ లో అమలు చేస్తున్నారని జీవో నెంబర్‌ 84, 85, 117 తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలపడం వల్ల రాష్ట్రంలో సుమారు పదివేల పాఠశాలలు మూతపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ లో నెలకొందని ఆవేదన చెందారు. పిజి కోర్సులు చదివే విద్యార్థులకు జీవో నెంబర్‌ 77 తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసేయడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు పీజీ కోర్సులు చేయలేక డిగ్రీ చదివి కూలి పనులు చేసుకునే దుస్థితి జగన్‌ ప్రభుత్వం కల్పిస్తుందని ధ్వజమెత్తారు. హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడతానన్న ముఖ్యమంత్రి నేడు పురుగులు పట్టిన బియ్యాన్ని పెడుతూ సంక్షేమ హాస్టల్స్‌ ఇచ్చి హాస్టల్‌ విద్యార్థులను అర్ధాకలితో ఉంచుతున్న ప్రభుత్వం జగన్మోహన్‌ రెడ్డి అని విమర్శించారు. యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా కామన్‌ పీజీ సెట్‌ పెట్టి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23వ తేదీన జరుగుతున్న బంద్‌ కు విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ బంద్‌ జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ అధ్యక్షులు పాటి రవికుమార్‌, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker