జగన్ కు కొత్త తలనొప్పిగా మారిన ‘శిలాశాసనం’ మాట!
నా మాటే శాసనం టైపులో చెప్పే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ (జులై 15) మహా చిరాకు పుట్టించే రోజుగా చెప్పాలి. ఎందుకంటే.. ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు దారుణంగా దెబ్బ తిని ఉండటం. వీటిపై కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారం.. ఏపీ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసింది. ఏపీలో రోడ్ల దుస్థితి మీద బోలెడెన్ని వీడియోలు.. ఫోటోలు.. మీమ్స్ తో జగన్ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాల్ని సంధిస్తున్నారు. రోడ్ల దుస్థితి మీద విపక్షాలు సైతం గళం విప్పేసరికి ఇబ్బందికి గురైన జగన్ ప్రభుత్వం.. అందరికీ సమాధానం చెప్పేందుకు వీలుగా ఘనమైన ప్రకటన చేశారు ఏపీ ముఖ్యమంత్రి.
‘రాష్ట్రంలో జులై 15 నాటికి రహదారులపై ఉన్న గుంతల్ని పూడ్చాలి. జులై 20న బాగు చేసిన రోడ్ల ఫోటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. డెవలప్ మెంట్ పనులకు ఎక్కడా లోటు లేదు. రాబోయే రోజుల్లో కచ్ఛితంగా ఫలితాలు కనిపించాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయటం.. గుంతలు లేని రోడ్లను తీర్చిదిద్దాలి’ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి జూన్ లో తన శిలాశాసనం లాంటి మాటల్ని చెప్పేశారు. క్యాలెండర్ లో ఆయన చెప్పిన జులై 15 వచ్చేసింది. జూన్ తో పోలిస్తే.. ఇప్పటికి ఏపీ రహదారులు మరింత దారుణంగా తయారు కావటమే కాదు.. మొన్నటి వరకున్న గుంటల మాదిరి ఉన్న రోడ్లు కాస్తా కుంటల స్థాయికి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే దుస్థితి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది 8 వేల కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారుల నిర్వహణ.. రిపేర్లు చేపట్టాలి. గడిచిన మూడేళ్లుగా రోడ్లను పట్టించుకోలేదు. దీంతో మూడేళ్లలో 24 వేల కి.మీ. రోడ్ల నిర్వహణ చేపట్టాలి. కానీ.. సీఎం జగన్ మాత్రం 8268 కి.మీ. రహదారుల రిపేర్వర్కు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు అవే పూర్తి కాలేదు. దీంతో.. వాటితో పాటు మిగిలిన వాటిని ఎప్పుడు చేస్తారో అర్థం కాని పరిస్థితి. దీంతో రాష్ట్ర ప్రజలు పాడైన రోడ్ల విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్ మాటల్ని ప్రస్తావిస్తూ ఇప్పుడున్న పరిస్థితిని తెలియజేస్తూ ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ తో సీఎం జగన్ కు మరింత చిరాకు గ్యారెంటీ అన్న మాట వినిపిస్తోంది.




