ఆంధ్రప్రదేశ్
ఉదయం తనిఖీలు.. సాయంత్రానికి చర్యలు…కమిషనర్ పనితీరే వేరు

ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు కమిషనర్ పనితీరే వేరు , పరిపాలనలో తేడాలు వస్తే సహించని మనస్తత్వం పారిశుధ్య కార్మికుల హాజరు నమోదులో అక్రమాలకు పాల్పడిన శానిటరీ ఇన్‌స్పెక్టర్, వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శి, ఇద్దరు పీహెచ్‌సీ వర్కర్లను నగర కమిషనర్ అరుణ సస్పెండ్ చేశారు. బుధవారం మసీదుమిట్ట మస్టర్ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు నమోదులో అక్రమాలు జరిగినట్లు గుర్తించి విచారణకు ఆదేశించారు. ఈ మస్టర్ పరిధిలో ఇద్దరు రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు, మరో ఇద్దరు అవుట్‌సోర్సింగ్ కార్మికులు మూడు నెలలుగా అనధికారికంగా విధులకు హాజరుకావడం లేదు. అయినా వీరు విధులకు హాజరైనట్లు నమోదు చేసి జీతాలు డ్రా చేశారు. ఈ చర్యలు నగరపాలక సంస్థకు నష్టం కలిగేలా ఉండటంతో కమిషనర్ తీఈ చర్యలకు బాధ్యులను చేస్తూ పారిశుధ్య పర్యావరణ కార్యదర్శి దామోదరం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లోకను సస్పెండ్ చేశారు. అదేవిధంగా రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు ఎన్. గుణశేఖర్, వెంకటేశులుపై సస్పెన్షన్ వేటు వేశారు. నగరపాలక సంస్థకు నష్టం కలిగించేలా ఏ అధికారి లేదా ఉద్యోగి వ్యవహరించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.




