All
కృష్ణదాస్‌కు తెలిసే ఇసుక దందా..?

మాజీ ఉపముఖ్యమంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గంలో ఇసుక అక్రమాలపై అదే పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని పర్లాం తదితర ఇసుకరేవుల్లో పెద్దఎత్తున సాగుతున్న అక్రమ వసూళ్లను అడ్డుకోకపోవడం శోచనీయమని అసంతృప్తి వ్యక్తంచేశారు. వైకాపా నాయకులు ముద్దాడ బాలభూపాలనాయుడు, పాగోటి రమణ భరద్వాజ్, బుద్దల రాజశేఖర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ… ఇసుకరేవుల్లో కొందరు వైకాపా నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదంతా కృష్ణదాస్‌కు తెలిసే సాగుతోందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడితే పార్టీ వాట్సప్ గ్రూపు నుంచి తమను తొలగించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు.



