Allజాతీయ వార్తలుముఖ్యాoశాలు
రైళ్లలో సీనియర్ సిటిజన్ల రాయితీకి మంగళం!

సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించబోమని స్పష్టంచేసింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాయితీలనూ రద్దు చేసిన రైల్వే శాఖ.. కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. గతంలో కొనసాగించిన అన్ని రాయితీలనూ తిరిగి పునరుద్ధరించే యోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టికెట్ రాయితీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బుధవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాయితీల వల్ల రైల్వే శాఖపై మోయలేని భారం పడుతోందని పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్లు సహా అన్ని వర్గాల ప్రయాణికుల వల్ల ఇప్పటికే సగటున 50 శాతం ఖర్చును రైల్వే శాఖ భరిస్తోందని అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. టికెట్ ధరలు తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ‘‘కొవిడ్ మూలంగా 2019-20తో పోలిస్తే ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. ఇది దీర్ఘకాలం లో రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో రాయితీ లను అనుమతిస్తే రైల్వే శాఖపై మరింత భారం పడుతుంది. కాబట్టి మునుపటిలా సీనియర్ సిటిజన్లు సహా అన్ని కేటగిరీల వారికీ రాయితీ పునరుద్ధరణ అనేది ఆశించడం సరికాదు’’ అని పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ప్రయాణ వివరాలను కూడా తన సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. 2019-20 సంవత్సరంలో 6.18 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రిజర్వుడు బోగీల్లో ప్రయాణించారని తెలిపారు. 2020-21లో 1.90 కోట్ల మంది, 2021-22లో 5.55 కోట్ల మంది ప్రయాణించినట్లు తెలిపారు. గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్ ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు పేర్కొన్నారు. 2019-20లో 22.62 లక్షల మంది సీనియర్ సిటిజన్లు రాయితీని వదులకున్నారని తెలిపారు. 2017-18, 2018-19, 2019-20 మధ్య కాలంలో రిజర్వుడు, అన్ రిజర్వుడు కేటగిరీల్లో సీనియర్ సిటిజన్లకిచ్చే రాయితీ వల్ల రైల్వే శాఖ మొత్తం రూ.4,794 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని తెలిపారు.
రైళ్లలో ప్రయాణించే వయోవృద్ధులకు ఏళ్లుగా భారతీయ రైల్వే రాయితీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. 50 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు 50శాతం రాయితీ కల్పిస్తుండగా.. 60 ఏళ్ల వయసు పైబడిన పురుషులకు మాత్రం 40 శాతం రాయితీని భారతీయ రైల్వే అందిస్తోంది. మొత్తంగా 53 రకాల రాయితీలను కల్పిస్తున్న రైల్వేకు ప్రతిఏటా దాదాపు 2వేల కోట్ల భారం పడుతున్నట్లు సమాచారం. వీటిలో సీనియర్ సిటిజన్ల రాయితీ వల్లే ఎక్కువ భారం పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో గడిచిన రెండేళ్లలో వయోవృద్ధులకు నిలిపివేసిన రాయితీ కారణంగా రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ ఈ వివరాలు వెల్లడించింది.




