ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
‘ఔను, నాకు అవగాహన లేదు. తప్పేంటి.?

జలవనరుల శాఖ మంత్రికి, నీటి ప్రాజెక్టులపై అవగాహన వుండాల్సిన పనేమీ లేదట. అలాగని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్.. ఈ పేర్ల విషయమై కొంత గందరగోళానికి గురవుతున్న అంబటి, విపక్షాలకు, మీడియాకీ అలాగే నెటిజనానికీ ఈజీ టార్గెట్ అయిపోయారు.
ఈ క్రమంలో, ‘ఔను, నాకు అవగాహన లేదు. తప్పేంటి.? నేర్చుకుంటాను. వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సర్జరీలు చేయడం తెలుస్తుందా.?’ అని ప్రశ్నించేశారు మంత్రి అంబటి రాంబాబు. నిజమే, తెలియాల్సిన రూల్ ఏమీ లేదేమో కూడా.!
కానీ, అంబటి ఇక్కడో జీవిత సత్యాన్ని ప్రజలకు తెలియజేశారు మీడియా ద్వారా. అదేంటంటే, కనీస అర్హతలు లేకుండానే ఆయా శాఖలకు రాజకయ నాయకులు మంత్రులైపోవచ్చని.. ఆ అవకాశం ప్రజాస్వామ్యం రాజకీయ నాయకులకు కల్పిస్తుందని.!
వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సర్జరీలు చేయాల్సిన జ్ఞానం వుండాల్సిన అవసరం లేదు. కానీ, ఆయా అనారోగ్య సమస్యలపై కనీస అవగాహన వుంటేనే.. ఆ శాఖ నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుంది. జలవనరుల శాఖ విషయంలో అయినా అంతే.
నిజానికి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి.? అన్నది ముఖ్యమంత్రి విచక్షణ మీద ఆధారపడి వుంటుంది. ఓ వైద్యుడికి మంత్రిగా అవకాశమిస్తే, ఓ ఇంజనీరుకి జలవనరుల శాఖ మంత్రిగా అవకాశమిస్తే.. ఎంత బావుంటుంది.? అన్న చర్చ ఇప్పుడు జనాల్లో కలుగుతోంది.
జల వనరుల శాఖకు సంబంధించి తనకు అవగాహన లేదని మంత్రి అంబటి రాంబాబు ఒప్పుకున్నారు. మరి, పోలవరం ప్రాజెక్టు విషయమై గడచిన ఎనిమిదేళ్ళుగా ఆయన మాట్లాడుతూనే వున్నారు.. విమర్శలు చేస్తూనే వున్నారు. మరి, ఈ అవగాహనా రాహిత్యంతో కూడిన విమర్శల మాటేమిటి.?


