ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

ఏడాదికొక సాక్షిని విచారిస్తారా…’సీఐడీ’పై ‘హైకోర్టు’ అసహనం

రాయలసీమ విశ్వవిద్యాలయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి 2017లో నమోదైన కేసు దర్యాప్తును ఇప్పటికీ పూర్తి చేయని సీఐడీపై హైకోర్టు మండిపడింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. ఇంతవరకు 16 మంది సాక్షులను విచారించామనడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏడాదికొక సాక్షిని విచారిస్తారా.. అవినీతి ఆరోపణలు ఉన్న కేసుల్లో దర్యాప్తు సాగించేది ఇలాగేనా అని నిలదీసింది. దర్యాప్తులో జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. 2017 తర్వాత ఈ తరహా కేసులు ఎన్ని నమోదయ్యాయి.. ఇప్పటి వరకు ఎన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తి చేశారు.. పెండింగ్‌ కేసుల పురోగతి తదితర వివరాలను అఫిడవిట్‌ రూపంలో న్యాయస్థానం ముందు ఉంచాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.
కర్నూలు రాయలసీమ వర్సిటీలో 2007-12 మధ్య జరిగిన కొనుగోళ్ల చెల్లింపుల్లో రూ.1.46 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని 2013లో విజిలెన్స్‌ విభాగం నిర్ధారించినా, ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని.. సీఐడీ విచారణలో ఎలాంటి పురోగతీ లేదని పేర్కొంటూ ఏఐఎ్‌సఎఫ్‌ నేత ఎం.కల్లప్ప హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, రాయలసీమ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీల రిజిస్ట్రార్లు, సీఐడీ అదనపు డీజీ, అప్పటి వీసీ జేవీ ప్రభాకరరావు(రిటైర్డ్‌), మాజీ వీసీ కె.కృష్ణనాయక్‌, ప్రస్తుత ఎస్‌కే వర్సిటీ రెక్టార్‌ ఎన్‌టీకే నాయక్‌, మాజీ రిజిస్ట్రార్‌ ఎంవీ నారాయణప్ప, అప్పటి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పిల్‌ సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది తాండవ యోగేశ్‌ వాదనలు వినిపిస్తూ..
బిల్లుల చెల్లింపునకు సంబంధించి రూ.1.39 కోట్ల వోచర్లను చూపించడంలో అధికారులు విఫలమయ్యారని.. మొత్తం రూ.1.46 కోట్లు దుర్వినియోగం అయినట్లు 2013లో విజిలెన్స్‌ నివేదిక ఇచ్చిందని తెలిపారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినా.. ఇప్పటివరకు చర్యలు లేవన్నారు. సీఐడీ దర్యాప్తులోనూ కదలిక లేదని.. కోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినా ప్రతివాదులు కౌంటర్‌ వేయలేదని తెలిపారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని.. ఇప్పటి వరకు 16మంది సాక్షులను విచారించామని.. కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీ అధిపతి ఎవరని అడిగింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి అని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. దీంతో 2017 నుంచి నమోదైన అవినీతి కేసుల దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించాలని ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker