తెలంగాణ
బంగారు తెలంగాణ సాధనలో ముందుకు….శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్

బంగారు తెలంగాణ సాధనలో ముందుకు సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మన రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేలా అందరూ తమవంతు పాత్ర పోషించాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సోమవారం వికారాబాద్ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం చేశారు.ఈనెల 22వ తేదీన జిల్లా కే ంద్రంలో వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారని చెప్పారు. హరితహారం కింద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 38.67 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటి వరకు 292.70 ఎకరాల్లో 28.19 లక్షల మొక్కలు నాటారన్నారు. జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 1,98,162 నల్లాలను బిగించి ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సాగయ్యే మొత్తం కంది పంట దిగుబడిలో మన జిల్లా నుంచే 44 శాతం పంట ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. జిల్లాలో రెండోవిడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 11,866 మంది లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలీలకు 45,82,140 పని రోజులు కల్పించి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపామని చెప్పారు. వీధి వ్యాపారులకు రూ.6.66 కోట్ల రుణాలు అందించారని తెలిపారు.



