ప్రభుత్వం మారగానే విధానాలను మార్చకూడదు…వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్

కొత్త పెట్టుబడులు రావడంలేదు. ఉన్నవి కూడా తరలిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదిరి,
కొంత మేరకు కొలిక్కి వచ్చినవి, పనులు కూడా ప్రారంభిస్తున్నవి మినహాయిస్తే… కొత్తగా వస్తున్న పరిశ్రమలే లేవు
! వస్తాయనే ఆశలూ కనిపించడంలేదు. దీనికి కారణం… జగన్ సర్కారు విధానాలపై జాతీయ స్థాయిలో పారిశ్రామిక
వేత్తలు ఏమాత్రం సంతృప్తితో లేకపోవడమే! దీనికి తాజా నిదర్శనం… వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్
చేసిన వ్యాఖ్యలు. ‘‘ప్రభుత్వం మారగానే విధానాలను మార్చకూడదు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకోవడంలేదు.
ఎందుకంటే… అక్కడి ప్రభుత్వం తన విధానాలను మారుస్తూ ఉంటుంది అని ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం, ప్రభుత్వ విధానాల గురించి ప్రస్తావిస్తూ… పరిశ్రమల ఏర్పాటుకు తాము
ఆంధ్రప్రదేశ్‌ను ఏ కోశానా పరిశీలించడంలేదని పరోక్షంగా చెప్పారు. అదే సమయంలో… పారిశ్రామిక విధానానికి సంబంధించి
కేబినెట్ ఆమోదంతో స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వం మారగానే విధానాలు మార్చకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మార్చేస్తున్నం దునే అక్కడికి ఎవరూ వెళ్లాలనుకోవడంలేదు’’ అని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. వేదాంత గ్రూప్
రాష్ట్రానికి కొత్తేమీ కాదు. 2018లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో పలు ఒప్పందాలు
కుదుర్చుకుంది. వైసీసీ ప్రభుత్వం రాగానే పరిస్థితులు మారిపోయాయి. విశాఖలో వరుసగా మూడేళ్లపాటు జరిగిన
పారిశ్రామిక ఒప్పందాలను తిరగదోడటం మొదలైంది. ‘అంత భూమి మీకు అక్కర్లేదు. భూమిని అంత తక్కువకు
ఇవ్వలేం. మీరు కొత్త ప్రతిపాదనలతో మళ్లీ రండి’ అంటూ రకరకాల కొర్రీలు పెట్టారు. పారిశ్రామిక వేత్తలను
విసిగించారు. దీంతో.. చాలా ఒప్పందాలు తెరపైకి రాలేదు. సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను
రద్దు చేయాలన్న నిర్ణయం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి పెను విఘాతంగా మారింది. ఇది జాతీయ, అంతర్జాతీయ
స్థాయిలో వివాదాస్పదమైంది.



