
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతదూరం ప్రయాణిస్తారు, అసలు రాజకీయాలలో పవన్ స్థిరంగా ఉంటారా.? లేదా మళ్లీ సినిమాలలోకి వెళ్లి పోతారా? అన్నది ఆపార్టీ క్యాడర్ కే అర్దం కావట్లేదు. ఏపీలో తెలుగుదేశం పార్టీ బలహీన పడుతున్న సమయంలో వైసీపీకి దీటుగా ఎదిగేందుకు జనసేన పార్టీ కు అవకాశాలున్నా, అధినేత తీరుతో రోజురోజుకూ పరిస్థితి దిగజారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా హీరోగా తనకున్న క్రేజ్ , పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అభిమానాన్ని ఓట్లరూపంలోకి మలచుకుని అధికారంలోకి వద్దామని చూసిన పవన్‌కు 2019 లో ఎన్నికల్లో జనసేన మీటింగ్ లకి వచ్చే జనాలను చూసి రాజకీయాలలో కూడా హిట్టవుతానని భావించాడు. ఎన్నికల పూర్తయ్యాక కనీసం ఓ ముప్పైసీట్లు వస్తాయని అంచనా వేసుకున్నారు. కానీ ఫలితాలు వచ్చేటప్పటికి పవన్ కి వాస్తవం బోధపడింది.సినిమా క్రేజ్ రాజకీయాల్లో పనిచేయదని అర్ధమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలై పరువు పోగొట్టుకున్నా, వెనక్కి తగ్గేది లేదని మరోమారు ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు . వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తు, పోరాటానికి శ్రీకారం చుట్టిన ఆయన అందివచ్చిన అవకాశాలతో వ్యూహాలు రచించి రాజకీయంగా ఎదగాల్సిన సమయంలో రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడి నవ్వుల పాలవుతున్నాడన్న విమర్శలూ లేక పోలేదు. ఒక్కొక్కరిగా పార్టీ నుంచి వెళ్తుండటంతో జనసేన పార్టీ లో కూడా పెద్దగా ప్రభావం చూపే రాజకీయ నాయకులు కరువయ్యారనే చెప్పాలి.
నాదెండ్ల మనోహర్ మినహా మిగతా నాయకులు ఎవ్వరూ ఎక్కువగాపవన్‌తో కనపడరు. ఉన్న కొంతమంది కూడా దూరమవుతుండటం ఆపార్టీ కేడర్‌ని అయోమయానికి గురి చేస్తోంది. అంతెందుకు . ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాడు అతనే రాజు రవితేజ. జనసేన పార్టీ స్థాపించడంలో తన ప్రమేయం ఉందని, తను జనసేనతో కలసి నడుస్తాడని పవన్ ప్రకటించాడు. ఇద్దరు కలసి ఇజం అనే పుస్తకాన్ని రచించారు. ఇటీవల పవన్ అనుసరిస్తున్న విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్న రవితేజ సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా చేసారు. పవన్ రాజకీయాలలో ప్రమాదకర శక్తిగా తయారవుతున్నారని, కుల,మత ప్రాతిపదికన రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపిస్తు రవితేజ జనసేనకు దూరమయ్యాడు. పవన్ సమాజానికి ప్రమాదకరం అంటూ రవితేజ చేసిన తీవ్ర ఆరోపణలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. అసలు జనసేన లో ఏం జరుగుతోంది అంటు ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఒంటెద్దు పోకడలు తో జనసేన జనానికి పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా పార్టీలో అర్ధమవుతోంది.
రాయలసీమ పర్యటనలో పవన్ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా గళమెత్తితే.. ఆయన పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంకు మద్దతుగా మాట్లాడారు. తర్వాత కాకినాడలో పవన్ రైతు సమస్యలపై ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తే మర్నాడే పవన్ సన్నిహితుడు రవితేజ పార్టీని వీడారు. ఇప్పుడు తర్వాత ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది. పవన్ తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీస్పీకర్ నాదెండ్ల పార్టీకి దూరమయ్యేలా వున్నారని పార్టీ వర్గాల్లో టాక్.. అలాగే జేడీ లక్ష్మీ నారాయణ ఇప్పటికే పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండగా అతి త్వరలో ఆయన కూడా పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది.పార్టీ బలపడాల్సిన సమయంలో ఇలా ఒక్కొక్కరు దూరమవడం, అసలు పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఒక్కరు లేకపోవడం,ఇప్పటికి పవన్ ఇమేజ్ తోనే పార్టీని లాగుతుండటం భవిష్యత్ లో పార్టీ భవితవ్యం ఏంటని సగటు కార్యకర్త ఆలోచిస్తున్నాడు.



