తెలంగాణ
ఆన్ లైన్ లో పంటల వివరాలను నమోదు చేయాలి: కలెక్టర్

రైతులు పండించిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భీమా పథ కంలో ఉన్న రైతులు చనిపోతే వెంటనే బీమా పోర్టల్లో క్లెయిమ్ పత్రాలను నమోదు చేయాలని ఆదేశించారు. పీఎం కిసాన్లో ప్రతి రైతు ఈకేవైసీ చేయించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అధిక వర్షాల నేపథ్యంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు, సునీత డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.



