ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

సంక్షేమం భాద్యత ఎక్సైజ్‌ శాఖ దే… చట్టసవరణ

గతంలో మద్యం నగదు ప్రభుత్వ ఖజానాకు వెళ్లి అక్కడి నుంచి వేర్వేరు శాఖల ద్వారా పథకాలకు వెళ్లేది. కానీ ఇప్పుడు నేరుగా అమ్మఒడి పథకానికి కావాల్సిన నగదును ఎక్సైజ్‌ శాఖే సమకూరుస్తోంది. ఈ శాఖకు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం చట్ట సవరణే చేసింది. తద్వారా మద్యం వల్లే అమ్మఒడి అమలవుతున్నట్టు ప్రభుత్వం స్పష్టంగానే చెప్పేసింది.
  అమ్మఒడికి ప్రభుత్వం ఇస్తున్నది ఎంత? మద్యం ద్వారా సర్కారు లాగుతోందెంత? ఒక్కసారి ఈ రెండు లెక్కలు పోల్చిచూస్తే కళ్లు తిరగడం ఖాయం. విడతలవారీగా నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం… మద్యాన్ని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తోందో బయటపడుతుంది. ఓవైపు మద్యం ద్వారా పేదల జేబులు ఖాళీ చేసి… అందులో కొంత అమ్మఒడికి పంచి… మాది సంక్షేమ ప్రభుత్వం అంటూ జగన్‌ సర్కారు ఆర్భాటం చేస్తోంది. అసలు అమ్మఒడికి నగదు ఎక్కడినుంచి వస్తోంది? అనేది పరిశీలిస్తే ఈ నగదు మద్యం ద్వారా ఎలా రీసైక్లింగ్‌ అవుతోందో ఇట్టే తెలిసిపోతుంది. అమ్మఒడి పథకానికి వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో చేసిన ఖర్చు రూ.19,617కోట్లు. ఇందులో 2019-20లో రూ.6,349కోట్లు, 2020-21లో రూ.6,673కోట్లు, 2021-22లో రూ.6,595కోట్లు పంపిణీ చేసింది. అయితే దీన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే మొత్తం ఇంత కూడా ఉండదు. ఎందుకంటే పారిశుధ్య నిర్వహణ, భవనాల నిర్వహణ అంటూ ఏటా వెయ్యి, రెండు వేలు అమ్మఒడి నగదులో ప్రభుత్వం కోత పెడుతోంది. కాగా ఇదే మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే అమ్మఒడి నగదుకు అక్షరాలా రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. 2019-20లో రూ.20,046 కోట్లు, 2020-21లో రూ.20,895కోట్లు, 2021-22లో 25,482 కోట్ల మేర అమ్ముడైంది. వెరసి మూడేళ్లలో అమ్మిన మొత్తం రూ.66,423కోట్లు. అంటే మూడేళ్లలో పేదలు మద్యం కింద చేసిన ఖర్చు చూస్తే అందులో అమ్మఒడి నగదు మూడో వంతు కూడా లేదు. ఇలాంటి మరో మూడు నాలుగు పథకాలు అలవోకగా మద్యం ద్వారా నడిపించవచ్చని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అయినా అమ్మఒడి ప్రతిష్ఠాత్మకం అనీ, ఇందుకోసం అప్పులు చేసైనా పథకం అమలుచేస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతోంది.
మద్య సంక్షేమం: ఎలాగూ మద్యం డబ్బులే పథకాలకు ఇస్తున్నాం కదా అనుకుందోఏమోగానీ ప్రభుత్వం నేరుగా సంక్షేమ పథకాలను మద్యం ఆదాయానికి ముడిపెట్టేసింది. అమ్మఒడి, చే యూత లాంటి పథకాలను మ ద్యం నగదుకు అనుసంధానం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్య నిషేధం హామీ ప్రధానమైనది. వైసీపీ అఽధికారంలోకి వస్తే మద్యం ఉండదని మహిళలు ఆశించారు. అయితే ఒక్కసారిగా కాదని, మూడు దశల్లో చేస్తామని వైసీపీ చెప్పింది. కానీ ఇప్పుడు మూడేళ్లు గడిచాక క్రమంగా నిషేధం హామీని పక్కనపెట్టే ప్రయత్నం చేస్తోంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్ల విక్రయం ద్వారా రూ.ఎనిమిది వేల కోట్ల రుణ సమీకరణ, రెండేళ్ల కాలానికి కొత్త బార్‌ పాలసీ నోటిఫికేషన్‌ జారీతో నిషేధం లేదని పరోక్షంగా తెలిపింది. మరోవైపు మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. తొలుత నిషేధంలో భాగమంటూ మద్యం ధరలు రెట్టింపు చేసింది. అప్పుడు నిజంగానే అమ్మకాలు ఢమాల్‌ అన్నాయి. దీంతో ఆదాయం తగ్గిందని గుర్తించిన ప్రభుత్వం తర్వాత మూడు దఫాల్లో పెంచిన ధరలు తగ్గించేసింది. ఇలా ఆదాయం కోసం పెంచడం, తగ్గించడం లాంటి విచిత్ర విన్యాసాలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker