ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా జగన్మోహన్‌రెడ్డి మారుస్తాడు….టీడీపీ అధినేత చంద్రబాబు

అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు
జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. డబ్బులివ్వడానికి బటన్ నొక్కుతున్నానంటున్న
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని.. అదే బటన్ నొక్కి ప్రజలు ఇంటికి పంపేస్తారని
హెచ్చరించారు. గోదావరి వరదలో ప్రజల కష్టాలను చూస్తే బాధేస్తోందన్నారు.
వారిని ఆదుకోకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. జనాలను బురదలోకి
తోసేసి గాలిలో తిరుగుతోందని ధ్వజమెత్తారు. నేరుగా వచ్చి ప్రజల కష్టసుఖాలు
తెలుసుకోవడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు తీరిక లేదని ఆక్షేపించారు. పశ్చిమ గోదావరి,
కోనసీమ జిల్లాల్లోని గోదావరి వరద ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు.
ఆచంట మండలం అయోధ్యలంకలో బాధితుల కష్టాలను చూసి చలించిపోయారు.
బురదలోనే కూలిన ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. కోనసీమలో సోంపల్లి,
చాకలిపాలెం జంక్షన్, మానేపల్లి, అప్పనపల్లి ప్రాంతాల్లో రాత్రి విస్తృతంగా
పర్యటించి బాధితులతో మాట్లాడారు. సాయం కింద ప్రతి ఇంటికీ 10 వేలివ్వాలని డిమాండ్ చేశారు.
‘పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.10 వేలు ఇస్తోంది. జగన్ సర్కారు విలీన .
గ్రామాల్లో రూ.2 వేలు ఇస్తుంటే అక్కడి ప్రజలు తామీ రాష్ట్రంలో ఉండం.. తెలంగాణలో కలిసి
పోతామంటున్నారు.వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు విజయవాడ నుంచి అయోధ్యలంకకు
రోడ్డు మార్గంలో వచ్చిన చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. ఏలూరు,
దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, సిద్దాంతం ప్రాంతాల్లో టీడీపీ
శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.



