ముఖ్యాoశాలుసినిమాలు

ప్రముఖ దర్శకులు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

ప్రముఖ దర్శకులు వంశీని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు ఎంతో ఫేమస్. విపరీతమైన పాఠకాదరణ పొందిన ఆ కథలపై తూర్పు గోదావరికి చెందిన కె. రామచంద్రా రెడ్డి పీహెచ్‌డీ చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో ‘పసలపూడి’  వంశీ సొంతూరు. దానికి సమీపంలోని ‘గొల్లల మామిడాడ’ కె. రామచంద్రారెడ్డి ఊరు. ఆయన 24 ఏళ్లుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పసలపూడి కథలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకని, తన పీహెచ్‌డీకి పరిశోథనాంశంగా ఎంచుకున్నారు. ఆయనదీ గోదావరే కాబట్టి అక్కడి యాస, భాష, మాండలికంపై అవగాహన ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేకుండా తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు.
వంశీ ‘పసలపూడి కథలు’పై పీహెచ్‌డీ చేసిన కె. రామచంద్ర రెడ్డి… తన పరిశోధనను మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజించారు. వాటిలో రచయితతో ముఖాముఖితో పాటు బాపు – రమణల ప్రశంసా కవిత, వంశీ కథలకు బాపు గీసిన బొమ్మలు, కథల్లోని ప్రాంతాల ఫోటోలతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు.
ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోని హిబ్రూ యూనివర్సిటీ ఈఆర్సీ – నీమ్ ప్రాజెక్టులో కె. రామచంద్రా రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. ‘అమెరికా అట్లాంటా’లోని ఎమొరీ యూనివర్సిటీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో పాల్గొని పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఇంకా పలు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సెమినార్లలో పాల్గొని రీసెర్చ్ పేపర్లు స‌బ్‌మిట్‌ చేశారు. ‘తూర్పుగోదావరి జిల్లా… సమగ్ర సాహిత్యం’ అనే బృహత్ సంపుటానికి, ‘తూర్పు గోదావరి జిల్లా కథలు… అలలు’ అనే కథా సంపుటికి సహ సంపాదకుడిగా పని చేశారు. ‘రంగుల నింగి’ అని 1998లో హైకూ సంపుటాన్ని వెలువరించారు. తెలుగు హైకూల్లో సామాజిక అనే అంశంపై ఎం ఫిల్ చేశారు. ఇప్పుడు వంశీ ‘మా పసలపూడి కథలు – ఒక పరిశీలన’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రచించి పీహెచ్‌డీ పట్టా పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker