జాతీయ వార్తలు

ధర్మం మరణిస్తే ఎవరూ బతికించలేరు……. జస్టిస్‌ ఎన్వీ రమణ

న్యాయం అందించడం కేవలం న్యాయ వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వం, చట్టసభలకు సమానమైన కర్తవ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగంలోని 38వ అధికరణ ప్రకారం ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అయినప్పటికీ ఈ రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, కాగ్‌ లాంటి సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. ధర్మానికి, చట్టానికి మధ్య ఉన్న తేడాను కూడా ఆయన వివరించారు. ధర్మమనేది చట్టాలకు మించినదని అన్నారు. ‘ధర్మం ప్రజల మనసుల్లో ఉంటుంది. అది ప్రజల మనసుల్లో మరణించినప్పుడు ఏ రాజ్యాంగమూ, ఏ చట్టమూ, ఏ సవరణా దాన్ని కాపాడలేదు’ అని ప్రముఖ న్యాయనిపుణుడు నానీ పాల్కీవాలా అన్న మాటల్ని జస్టిస్‌ రమణ ఈ సందర్భంగా ఉటంకించారు. కాగా, భారత న్యాయవ్యవస్థ దేశంలో అత్యంత విశ్వసనీయ వ్యవస్థగా ఎదిగిందని జస్టిస్‌ రమణ అన్నారు. సుప్రీంకోర్టు రూపొందించిన ‘భారత న్యాయస్థానాలు, నాటి నుంచి నేటి వరకు’ అన్న తెలుగు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker