కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ…పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం నోటీసులు

సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను సెప్టెంబరు 15కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులు, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరి 8న వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ ఉత్తర్వులను ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్)లో సవాల్ చేశారు. క్యాట్ జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.




