సమస్యల సాధనకు 14 రోజులపాటు జాతీయ గీతాలాపన


బిల్డర్లకూ, ప్రజా ప్రతినిధులకూ విన్నవించుకుంటున్న వైనం
హైదరాబాద్, ఆగస్టు 21: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిథిలోని శిల్ప కాలనీ వాసులు తమ సమస్యల సాధనకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. 14 రోజుల పాటు జాతీయ గీతాలాపన చేశారు. సోమవారం అంటే ఈనెల 22న 14వ రోజు కార్యక్రమంతో తమ తొలిదశ శాంతియుత ఆందోళనను ముగించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని కాలనీ వాసులు ప్రతి రోజు ఉదయం 9.30గంటలకు సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు. ఆగస్టు 15న జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎమ్టి స్వర్ణపురి కాలనీ కౌన్సిలర్ శ్రీమతి రాజేశ్వరి జెండాను ఆవిష్కరించారు. ఈ నెల 21న అంటే ఆదివారంనాడు కాలనీ యావత్తూ కదిలివచ్చి, కాలనీ ముఖద్వారం వద్ద జాతీయగీతాలాపన చేసి, తమ సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రజాప్రతినిధులకు కనికరం కలగడం లేదు. డ్రైనేజీలు పొంగి, కాలనీ మొత్తం ప్రవహిస్తున్నాయి. రోడ్లు బాగోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. అంబులెన్సు కూడా కాలనీ లోపలికి రాలేని దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సుజాత చొరవ తీసుకుని, కాలనీలో ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి మురుగునీటిని తోడించి, బయటకు తరలింపజేస్తున్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నడుంబిగించిన కాలనీవాసులు అంతా విద్యాధికులే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ కాలనీలో ఎక్కువగా ఉన్నారు. తమ డ్యూటీ షిఫ్టులకు అనుగుణంగా వారు ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు మొరపెట్టుకుంటున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం, కాలనీ వాసులు జాతీయ జెండా ధరించి హెచ్ఎమ్టీ కాలనీ మీదుగా పాదయాత్ర నిర్వహించారు. నల్ల చొక్కాలు ధరించి, చొక్కాలకు సేవ్ శిల్ప ఫ్రమ్ డ్రైనేజ్ ప్రోబ్లమ్ అనే నినాదంతో కూడిన బ్యాడ్జిలను పెట్టుకుని పాదయాత్ర చేశారు. మంగళవారం నుంచి తమ తొలిదశ ఆందోళనను ప్రారంభిస్తామని కాలనీవాసులు పేర్కొన్నారు. శాంతియుత బాటను వీడబోమని వారు స్పష్టంచేశారు.




