తెలంగాణముఖ్యాoశాలు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో పనిచేస్తాం…… అద్దంకి దయాకర్

రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, ఆయన నేతృత్వంలో పనిచేస్తామని టీపీసీసీ అధికార ప్రతనిధి అద్దంకి దయాకర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటే అందరికి అపారమైన గౌరవం ఉందన్నారు. గతంలో జరిగిన వాటికి వెంకట్‌రెడ్డికి తనతోపాటు రేవంతర్‌రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. ప్రియాంకగాంధీ నేతృత్వంలో వెంకట్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటారని, స్టార్ క్యాంపెయినర్ అయిన వెంకట్‌రెడ్డి నేతృత్వంలో తాము కూడా పనిచేస్తామని స్పష్టం చేశారు. వెంకట్‌రెడ్డికి ఎంతో చరిత్ర ఉందని అన్నారు. మునుగోడులో డబ్బు ఏరులై పారుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థి ఎన్నిక కోసం ప్రియాంకగాంధీ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం అయ్యిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంపాలనే కుట్రతోనే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు. మోసం చేసిన రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.



