ఆంధ్రప్రదేశ్

ప్రజల రక్షణ కోసమే రోడ్డు భద్రత నియమాలు కట్టుదిట్టంగా అమలు…

రేపల్లె: ప్రజల రక్షణ కోసమే రోడ్డు భద్రత నియమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ అన్నారు. ఎస్‌పి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి శనివారం 'నో ఆక్సిడెంట్‌ డే' ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రేపల్లె రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సాధారణ తనిఖీల్లో భాగంగా స్టేషన్‌ రికార్డులను ఎస్‌పి పరిశీలించారు. రికార్డుల పరిశీలన అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది కలసి రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముఖ్యమైన కూడలి, బ్లాక్‌ స్పాట్స్‌/ఆక్సిడెంట్‌ ప్రొనె ఏరియా వద్ద ప్రజలకు, వాహనచోదకులకు అవగాహన ఫెక్సీలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై రోడ్డు భద్రత, రక్షణ, అతివేగం వంటి విషయాలపై సంకేత బోర్డులతో అవగాహన కల్పించారు. రహదారులపై ద్విచక్ర వాహనాలు నడుపుతూ వున్నవారు తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌, హెల్మెట్‌ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఎక్కువ స్పీడ్‌తో వెళ్లరాదని, తప్పనిసరిగా ప్రామాణిక కలిగిన హెల్మెట్‌ ధరించి వాహనం నడపాలని, వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీస్‌ అధికారులు సూచించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌ రూల్స్‌, రెగ్యులేషన్స్‌పై అవగాహన కల్పించారు. అంతేకాకుండా సరైన వాహన కాగితాలు కలిగి ఉండాలని, డ్రైవర్‌లు ఓవర్‌ లోడ్‌తో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. సరుకు రవాణా వాహనాలలో ప్రజారవాణా చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరంతర వాహన తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఎక్కువగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నందున ప్రమాదాల నియంత్రణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు చేపడుతున్నామని ఎస్‌పి తెలిపారు. వాహనదారులు తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు స్వస్తి పలకాలన్నారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి హెచ్చరించారు. జిల్లాలో అన్ని రకాల కేసులు 35,000 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. కేసులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వివాదాలకు తావు లేకుండా అందరూ ఆనందంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ఎస్‌పి కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌పి శ్రీనివాసరావు, పట్టణ సీఐ విజయచంద్ర, రూరల్‌ సీఐ శివ శంకర్‌, నియోజకవర్గ ఎస్‌ఐలు, స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker