తెలంగాణముఖ్యాoశాలు

జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం….అదనంగా మూడు నెలల గడువు కోరిన నిర్మాణ సంస్థ


ఇటీవలి సీఎం సమీక్షలో చర్చ..... తుది నిర్ణయంపై అస్పష్టత




  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ భవనం వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్ధం కాబోతోంది. ఈ దసరా నాటికే పూర్తిచేసి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా.. పనుల్లో ఆలస్యం వల్ల కుదరని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని నిర్మాణ సంస్థ కోరినట్టు తెలిసింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ కొత్త సచివాలయ పనులను తనిఖీ చేసిన సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఈ అంశంపై చర్చ జరిగింది. దసరా నాటికి సచివాలయాన్ని ప్రారంభించాలని సీఎం పేర్కొనగా.. ఆలోగా భవనం పైభాగంలో పలు పనులు పూర్తయ్యేలా లేవని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారని.. దీనిపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దసరా నాటికే పూర్తికావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. తీరు మారకుంటే ఎలాగని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే కేవలం పైభాగంలో కొన్నిపనులే జరగాల్సి ఉన్నందున, దసరా నాటికి కొత్త సచివాలయాన్ని ప్రారంభించుకోవచ్చని, పైభాగంలో పనులతో పెద్దగా ఇబ్బంది ఉండదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్టు సమాచారం. మూడు నెలలు సమయమిస్తే అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దసరా నాటికి భవనాన్ని ప్రారంభిస్తారా, నిర్మాణ సంస్థ కోరిన గడువిచ్చి అన్ని పనులు పూర్తయ్యాకే ప్రారంభిస్తారా అన్నదానిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వరుస ఆటంకాలతో..
కొత్త సచివాలయం నిర్మాణం ప్రారంభించినప్పుడు 2021 దసరా నాటికే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వరుస ఆటంకాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. భారీ భవనం అయినందున పునాదులను లోతుగా తవ్వారు. ఈ సమయంలో కఠినమైన రాయి రావడం, కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ చేసి తొలగించాల్సి రావడంతో సమయం వృధా అయింది. తర్వాత కరోనా లాక్‌ డౌన్లతో పనులు ఆగిపోయాయి. కూలీలు తిరిగి వచ్చి పనులు గాడినపడేందుకు నెలల సమయం పట్టింది. రాజస్థాన్‌ ధోల్పూరు గనుల నుంచి ఆగ్రా ఎర్రరాయి, లేత గోధుమ రంగు రాయిని తెప్పించడం కోసం సమయం పట్టింది. వేగంగా పూర్తిచేసేందుకు కూలీల సంఖ్యను రెట్టింపు చేసి.. 2,800 మందిని వినియోగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker