లింగంపల్లి జంక్షన్ లో ఫ్లైఓవర్ కి లైన్ క్లియర్

గ్రేటర్ హైదరాబాద్ శివారులోని బీహెచ్‌ఈఎల్ జంక్షన్‌లో ట్రాఫిక్ చిక్కుముళ్లకు త్వరలో చెక్ పడనుంది. ఎప్పుడో అటకెక్కిన ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రతిపాదనకు మోక్షం కలిగింది. కేంద్ర రవాణ శాఖ నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో బీహెచ్‌ఈఎల్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జాతీయ రహదారి 65లోని హైదరాబాద్-పుణె మార్గంలో గల బీహెచ్‌ఈఎల్ వద్ద 1.65 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ను ఆరు లైన్లతో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అక్కడ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కునే వాహనదారులకు ఇది ఉపశమనమే. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన బీహెచ్‌ఈఎల్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున వివిధ రకాల కంపెనీలున్నాయి. పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలూ వెలిశాయి. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. దాంతో బీహెచ్‌ఈఎల్ జంక్షన్‌లో సిగ్నల్ పడితే నలువైపులా వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గం గుండా నగరంలోకి ప్రవేశించడం, నగరం నుంచి బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. తాజాగా బీహెచ్‌ఈఎల్ జంక్షన్‌లో రూ.130.65 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయితే నల్లగండ్ల ఓల్డ్ ముంబై రోడ్డు మార్గం ద్వారా నగరంలోకి రావడం, లింగంపల్లి రోడ్డు నుంచి ఐటీ కారిడార్‌కు చేరడం సులభం కానుంది. పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి కూడా ఉపయోగపడుతుంది.




