తెలంగాణ
వైభవంగా వజ్రోత్సవ వేడుకలు : మంత్రి తలసాని

భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 9 నుంచి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్‌మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఆగస్టు 15 వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. అందులో భాగంగా విద్యార్థులకు గాంధీజీ చరిత్రను తెలియజెప్పి, విద్యార్థి దశ నుంచే దేశభక్తి ని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 563 స్క్రీన్స్ లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
విద్యార్థులను థియేటర్లకు తీసుకెళ్లే రవాణాఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేపడుతుందని, అంతేకాకుండా వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందిస్తామన్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో సమీక్షించాలని హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తాను మంత్రి ఆదేశించారు.




