ఆంధ్రప్రదేశ్
‘హైకోర్టు తరలింపు అంశాన్ని, హైకోర్టులో తేల్చుకోవాలి..’

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి హైకోర్టుని, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ప్రభుత్వం భావిస్తున్న కర్నూలుకి తరలిస్తారా.? లేదా.? ఈ విషయమై గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు.! అదిగో తరలింపు, ఇదిగో తరలింపు.. అంటూ అధికార వైసీపీ ఆడుతున్న ‘డ్రామాలు’ అన్నీ ఇన్నీ కావు.
మొన్నామధ్యన న్యాయ శాఖకు సంబంధించి ఏవో కొన్ని కార్యాలయాలను కర్నూలుకి తరలించినట్లుగా వైసీపీ చెప్పుకుంది. అదిగో, ‘న్యాయ రాజధాని దిశగా తొలి అడుగు..’ అని వైసీపీ ప్రచారం చేసుకుంది. ఇంతకీ, ఆయా కార్యాలయాల తరలింపు జరిగిందా.? లేదా.? ప్చ్, స్పష్టత లేదాయె.!
తాజాగా, పార్లమెంటులో న్యాయ రాజధాని విషయమై వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం చెప్పేసింది. ‘హైకోర్టు తరలింపు అంశాన్ని, హైకోర్టులో తేల్చుకోవాలి..’ అని స్పష్టం చేసింది కేంద్రం. అంతేనా, ‘హైకోర్టు తరలింపుకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ఫైనల్ ప్రతిపాదనా పెండింగ్‌లో లేదు’ అని కేంద్రం స్పష్టతనిచ్చింది.
వైసీపీ సర్కారు, మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీ నుంచి వెనక్కి తీసుకున్నాక, న్యాయ రాజధాని అన్న ప్రస్తావన ఎందుకు వస్తుంది.? ఛాన్సే లేదు. పోనీ, కొత్త బిల్లు ఏమైనా మూడు రాజధానులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిందా.? అంటే అదీ లేదాయె.
ఒక్క మాటలో చెప్పాలంటే, మూడు రాజధానుల పేరుతో పెద్ద నాటకానికే వైసీపీ సర్కారు తెరలేపింది. ఆ పేరు చెప్పి, అమరావతి అభివృద్ధిని అడ్డుకుంది. ఓ ప్రభుత్వం, ఓ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడం అన్నది ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇదే తొలిసారి, ఇదే చివరి సారి అని కూడా భావించాలేమో.!
మూడు రాజధానులతో పరిపాలన, అభివృద్ధి మరింత మెరుగ్గా వుంటాయన్న వాదన సబబేనని అనుకుందాం. అందులో ఒకటైన అమరావతిని ఎందుకు నిర్లక్ష్యం చేసినట్లు.? అమరావతిని ఓ మోస్తరుగానైనా అభివృద్ధి చేశాక, మరో రెండు రాజధానులు.. అని వైసీపీ సర్కారు చెబితే, ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ వుండవ్ కదా.!



