1479 కోట్లతో తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు

ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆశయ సాధన
దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్
కాలేజీ ల ఏర్పాటు, అనుబంధ దవాఖానాల అప్‌గ్రేడేషన్‌కు పరిపాలన అనుమతులు జారీ చేసింది.
ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల, వికారాబాద్,
ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో
మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా ప్రభుత్వం 4 కొత్త
వైద్య కళాశాలలు మహబూబ్ నగర్ , నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది. దీంతో
ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, ఈ కళాశాలల్లో వైద్య
విద్యా బోధన విజయవంతంగా జరుగుతోంది.రెండో విడుతగా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల,
రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో
ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ప్రతి కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లకు అవసరమైన ఏర్పాట్లు
చేయనున్నారు. కాలేజీ భవనాల నిర్మాణాలను ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది. హాస్పిటల్
భవనాల అప్‌గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు బాధ్యతలను టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించారు.




