తెలంగాణ
మునుగోడుకు కొత్త పథకాలు?

మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక వ్యుహరచన చేస్తున్నారు. అక్కడ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మునుగోడు నియోజకవర్గానికి ఇంకేం చేయాలన్న దానిపై సీఎం దృష్టి సారించినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులతోపాటు, కొత్తగా కొన్ని పథకాలు ప్రకటించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆదివారం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సీఎం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు అందుతున్న లబ్ధిదారులు ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు? ఇంకా ఎంత మందిని లబ్ధిదారులుగా చేయవచ్చనే అంశాలపై వారితో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ పరంగా నియోజకవర్గంలోని ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించాలనే యోచనలో టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ప్రతి మండలానికి ఒక మంత్రికి, ప్రతి రెండు మూడు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కీలక నేతలందరినీ మునుగోడుకు పంపించేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం సిద్ధమయింది. మొత్తంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వమంతా అక్కడే పని చేయనుంది.




