తెలంగాణ
నేడే ‘సామూహిక జాతీయ గీతాలాపన

‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నగరంతో పాటు రాష్ట్రమంతటా అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని, అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు సీఎస్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆబిడ్స్ కూడలిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగాకూడళ్లలో నిమిషం పాటు అన్ని వైపులా రెడ్ సిగ్నళ్లు వేయనున్నారు. ఈ సందర్భంగా సాధారణ ప్రజానీకానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్ చెప్పారు. కాగా, ప్రస్తుత సచివాలయం బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.




