జాతీయ వార్తలు

ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్థులు ఢిల్లి లో ఆందోళన

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్‌లో ఎంబిబిఎస్‌ విద్యనభ్యసిస్తున్న భారత విద్యార్ధులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. యుద్ధం ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో తెలీక, చదువు కొనసాగించడం అర్ధం కాక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్నారు. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన తెలుగురాష్ట్రాల విద్యార్ధులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఆ దేశంలో ఎంబిబిఎస్‌ చదవడానికి వెళ్లిన విద్యార్ధులు విధిలేక స్వదేశాలకు తిరిగి వచ్చారు. గత ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం విద్యార్ధుల్ని సురక్షితంగా స్వస్థలాలకు తరలించినా వారి చదువులు మాత్రం ప్రశ్నార్ధకంగా మారాయి. భారత్‌ నుంచి దాదాపు 16వేల మంది విద్యార్ధులు ఉక్రెయిన్‌లోని వివిధ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. స్వదేశాలకు తిరిగి వచ్చిన వారిలో వివిధ సంవత్సరాలు చదువుతున్న విద్యార్దులు ఉన్నారు.
యుద్ధం ముగిసి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వాతావరణం కనిపించకపోవడంతో విద్యార్ధులు తమను దేశంలోని మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విదేశాల్లో ఎంబిబిఎస్‌ చదువుకున్న విద్యార్ధుల్ని దేశీయంగా మెడికల్ కోర్సుల్లో చేర్చుకునేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు అంగీకరించవని కేంద్రం చెబుతోంది. దీంతో పాటు దేశంలో మెడికల్‌ సీట్లు అందుబాటులో లేవని, వేల సంఖ్యలో ఉన్న విద్యార్ధుల్ని కాలేుజీలకు సర్దుబాటు చేయడం సాధ్యమవదని చెబుతున్నారు.
ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్ధులు మాత్రం దేశంలో 600పైగా వైద్య కళాశాలు ఉన్నాయని, ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్ధులు ఎంబిబిఎస్‌ వివిధ సంవత్సరాలకు చెందిన వారు ఉన్నందున వారిని అయా రాష్ట్రాలలో సర్దుబాటు చేయడం సులువేనని చెబుతున్నారు. ఒక్కో తరగతిలో 150మంది వైద్య విద్యార్ధులు ఉన్నందున కాలేజీకి నలుగురైదుగురిని సర్దుబాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది రాదని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని కాలేజీలలో విద్యార్ధులను సర్దుబాటు చేస్తే ఒక్కో కాలేజీలో 20మందికి మించి ఉక్రెయిన్ విద్యార్ధులు సరిపోతారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker