డ్రింక్స్‌పై సర్వీస్ ట్యాక్స్ రద్దు.. భోజనం, టిఫిన్‌పై పెంపు

ప్రీమియం రైళ్లైన రాజధాని, దురంతో, శతాబ్దిలలో ప్రయాణికులు అప్పటికప్పుడు ఆర్డరిచ్చే పానీయాలు, భోజనాలపై విధించే సేవా రుసుములను రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాల ధరలను మాత్రం రూ.50 చొప్పున పెంచింది. టికెట్ రిజర్వు చేసుకునే సమయంలోనే టీ, కాఫీలను బుక్ చేసుకోకుండా ప్రయాణ సమయంలో వాటికి ఆర్డరిస్తే ఒక్కో కప్పునకు రూ.50 చొప్పున సర్వీసు ఛార్జీ అదనంగా వసూలు చేసేది. కప్పు టీ రూ.20 అయితే, మొత్తం రూ.70 చెల్లించాల్సి వచ్చేది. ముందుగా బుక్ చేసుకున్న వారికైతే రూ.20కే సరఫరా చేసేది. తాజా ఉత్తర్వు ప్రకారం…ముందస్తుగా రిజర్వు చేసుకున్నా, చేసుకోకపోయినా ప్రయాణికులందరికీ ఒకే విధంగా సేవా రుసుం లేకుండానే ఆ పానీయాలను అందించనుంది. గతంలో బ్రేక్ ఫాస్ట్ ధర రూ.105, మధ్యాహ్న భోజనం ధర రూ.185, రాత్రి భోజనం ధర రూ.90గా ఉండేది. ఒక్కోదానిపై సర్వీసు ఛార్జీ రూ.50 అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ముందుగా బుక్ చేసుకున్నా, ప్రయాణ సమయంలో ఆర్డరిచ్చినా అందరికీ ఒకే ధర వర్తించేలా రూ.50ల చొప్పున అన్నిటి ధరలనూ పెంచినట్లు అధికారి ఒకరు తెలిపారు. కొత్త ధరల ప్రకారం బ్రేక్ ఫాస్ట్‌కు రూ.155, మధ్యాహ్న భోజనానికి రూ.235, రాత్రి భోజనానికి రూ.140 చెల్లించాల్సి వస్తుంది.


