తెలంగాణముఖ్యాoశాలు

ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే…బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది….కేసీఆర్‌

కేంద్రప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతి వేదికపై కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. మునుగోడు లో టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ  కేంద్రమంత్రి అమిత్‌షాను కేసీఆర్ టార్గెట్ చేశారు. కృష్ణానది జలాలను ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయమంటే మోదీ చేయలేదని తప్పుబట్టారు. తమ ప్రశ్నలకు అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవాచేశారు. ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే.. బావి కాడ మీటర్లు ఉన్నట్టేనని హెచ్చరించారు. ప్రజల మద్దతుతోనే తాను మీటర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని ‘రైతులకు అనవసరంగా డబ్బులు పంచిపెడుతున్నామని అంటున్నారు. రైతుబంధు, పింఛన్లు ఎందుకు ఇస్తున్నారని మమ్మల్ని నిలదీశారు. సంక్షేమ పథకాలు బంద్‌ పెట్టాలని అంటున్నారు. మీటర్లు పెట్టే బీజేపీ కావాలా?, మీటర్లు వద్దనే టీఆర్‌ఎస్‌ కావాలా?.. ఈడీకి దొంగలు భయపడుతారని మేమెందుకు భయపడతాం?.. మీరు గోకినా.. గోకకపోయినా.. నేను గోకుతా. ప్రధాని మోదీ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగింది?.. బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది. ఇక రైతులు, భూములను కూడా కేంద్రం అమ్మేస్తుందేమో?.. ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరు. బావికాడ మీటర్‌ పెట్టు కేసీఆర్‌ అంటున్నారు. చచ్చినా పెట్టా అని కేంద్రానికే చెప్పా. ఎరువుల ధరలు పెంచాలి, కరెంట్‌ రేటు పెంచాలి. మోదీ పాలనలో పండిన పంటలకు ధర రాదు. మోదీ దోస్తులు సూట్‌ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. కార్పొరేట్‌ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోంది’’ అని మోదీ తెలిపారు. కొట్లాడటం తెలంగాణ ప్రజలకు కొత్త కాదని, కొట్లాడటం మొదలుపెడితే ఎక్కడిదాకా అయినా వెళ్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తేల్చరు? అని ప్రశ్నించారు. మునుగోడు ఫ్లోరైడ్‌ సమస్యతో ఎలా గోసతీసిందో అందరికీ తెలుసన్నారు. ఫ్లోరైడ్‌ సమస్యతో ఎలా బాధపడిందో మనం చూశామని, జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని చెప్పారు. ఉద్యమం సమయంలో తాను అనేకసార్లు సమస్యను ప్రస్తావించానని, నల్లగొండ నగరా పేరుతో 15 రోజుల పాటు జిల్లా మొత్తం తిరిగానని తెలిపారు. శివన్నగూడెం గ్రామంలో నిద్ర కూడా చేశానని కేసీఆర్ గుర్తుచేశారు. మిషన్‌ భగీరథ పేరుతో ఫ్లోరైడ్‌ లేని నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాను నో మ్యాన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు కూడా హెచ్చరించారని, ఫ్లోరైడ్‌ బాధితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి చూపించినా ఎవరూ వినలేదని పేర్కోన్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐకి ధన్యవాదాలు. సీపీఐ ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఈ ఐక్యత మునుగోడు నుంచి ఢిల్లీ వరకు ఇలాగే కొనసాగాలి. దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం చేసి ముందుకు సాగాలి. భవిష్యత్‌లో సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తాయి’’ అని కేసీఆర్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker