ఎడిటోరియల్ముఖ్యాoశాలు

ప్రభుత్వం లో ఐనా పార్టీ లో ఐనా …….మోదీ మాటే సుగ్రీవాజ్ఞ

బీజేపీని నడిపిస్తుందా లేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. మార్గదర్శకత్వాన్ని మించిపోయిందా అని ఇటీవలి కాలంలో జరుగుతున్న చర్చకు సమాధానం దొరికింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలను చూస్తే మోదీ మాటే సుగ్రీవాజ్ఞ అని అర్థం అయిపోయింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం ఆరు కొత్త మొఖాలు ఉన్నాయి. రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాననీ తాను ఇంతవరకు పోటీ చేస్తూ వచ్చిన షికారీపుర నియోజకవర్గం నుంచి తన చిన్న కొడుకు విజయేంద్రకు అవకాశం ఇస్తే చాలునని చెప్తూ వచ్చిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్పకు పార్లమెంటరీ బోర్డులో స్థానం దక్కడం అన్నింటికన్నా ఆసక్తికరమైన అంశం. బీజేపీకి తిరుగులేని నాయకుడు మోదీ అన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అలాగే ఆయన అనుంగు మిత్రుడు అమిత్‌ షా స్థానమూ చెక్కు చెదరలేదు. మోదీ తరవాతి స్థానం కచ్చితంగా ఆయనదే. మోదీ, షా తరవాత బీజేపీ నాయకుల వరసలో వినిపించే మరో పేరు పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ దే. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ప్రభ కొంత కొడిగట్టింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు మహత్తరమైన బాధ్యతలేవీ అప్పగించలేదు. నితిన్‌ గడ్కరీకి స్థానం దక్కకపోవడం విశేషమే అయినా మోదీ ఆధిపత్యానికి తిరుగు లేదు కనక ఆశ్చర్యకరమైతే కాదు. గడ్కరీకి ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రతి వారం నాగ్‌పూర్‌ వెళ్తూనే ఉంటారు. ఇది మోదీకి నచ్చినట్టు లేదు. విధాన నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి స్థానం దక్కక పోయినా ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకత్వం ఏమీ చేయలేని స్థాయికి మోదీ ఎదిగిపోయారు. నాగపూర్‌ అధినేతలకు ఇష్టుడైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మాత్రం కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు దక్కింది. ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వం లోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఫడ్నవీస్‌దే కీలక పాత్ర కనక ఆయనకు ఇది ఓ రకమైన బహుమానమే అనుకోవాలి. యోగీ ఆదిత్యనాథ్‌ బలమైన నాయకుడే. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు, ఆయన భాషలో చెప్పాలంటే మొత్తం 80 సీట్లు బీజేపీ బుట్టలో పడేయడానికి యోగి ఆదిత్యనాథ్‌ కీలక పాత్ర పోషించవలసి ఉంది. అయినా ఆయనకు పార్లమెంటరీ బోర్డులో చోటు దొరకలేదు. యోగి ఆదిత్యనాథ్‌ కరడుగట్టిన హిందుత్వ వాదే అయినా ఆయన ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుదురులోని వారు కాదు. గోరఖ్‌పూర్‌ మఠాధిపతిగానే ఆయన ప్రధానంగా వెలుగులోకి వచ్చారు. అదీగాక మోదీకి ఆయనే వారసుడు అన్న ప్రచారం సహజంగానే మోదీ, షా ద్వయానికి మింగుడు పడలేదు. ఎమ్మెల్యేలు బన్సల్‌ చుట్టూ తిరగడం యోగికి కంటగింపైంది. బన్సల్‌ను పంపించడమే యోగీకి దక్కిన ఊరట. బీజేపీ తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్లీ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నప్పటికీ పార్లమెంటరీ బోర్డులో మాత్రం స్థానం దక్కలేదు. . కర్నాటక బీజేపీలో అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణల కారణంగా గత ఏడాది యడియూరప్ప చేత రాజీనామా చేయించారు. అందుకే కొంత కాలంగా ఆయన కినుక వహించి ఉన్నారు. ఎన్నికల్లో విజయానికి మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కనక మళ్లీ యడియూరప్పను పార్లమెంటరీ బోర్డులో నియ మించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ ఆనువంశిక పాలన, అవినీతి అంటూ ఒంటికాలి మీద లేచి దుమ్మెత్తి పోశారు. కానీ ఈ రెండు ‘‘లక్షణాలు’’ యడియూరప్పకు ఉన్నాయి. యడియూరప్ప పెద్ద కొడుకు రాఘవేంద్ర పార్లమెంటు సభ్యుడు. చిన్న కొడుకు విజయేంద్రను తన రాజకీయ వారసుడిని చేయాలను కుంటున్నారు. బీజేపీ నేతల్లో అవినీతిపరుల గురించి చెప్పాలంటే యడియూరప్ప పేరే ముందు వరసలో ఉంటుంది. ఎన్నికలలో విజయం కోసం మోదీ చెప్పే నీతులను అవలీలగా ఉల్లంఘించి రాజీ పడగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker