ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
చెల్లికి పెళ్ళి.. జరగాలి మళ్ళీ మళ్ళీ

చెల్లికి పెళ్ళి.. జరగాలి మళ్ళీ మళ్ళీ అంటాడో సినిమాలో కామెడీ విలన్. అలా తయారయ్యింది పరిస్థితి. చంద్రబాబు హయాంలో కడప స్టీలు ప్లాంటుకి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలోనూ ఇంకోసారి శంకుస్థాపన జరిగింది. అంతకన్నా చాలాముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ స్టీలు ప్లాంటు పేరుతో హంగామా నడిచింది. అదే బ్రాహ్మణి స్టీల్స్ వ్యవహారం.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, కేంద్రం కడప స్టీలు ప్లాంటు నిర్మాణం చేపట్టాల్సి వుండగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వున్న విశాఖ స్టీలు ప్లాంటునే అమ్మేస్తోన్న కేంద్రం, కొత్తగా రాష్ట్రంలో కడప స్టీలు ప్లాంటుని ఎలా ఏర్పాటు చేస్తుంది.? పైగా, ఈ విషయమై కేంద్రాన్ని నిలదీసేంత ధైర్యం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలకు లేదాయె.! కడప స్టీలు ప్లాంటు కోసం నిరాహార దీక్ష కూడా చేసిన అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్, ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
స్టీలు ప్లాంటు వ్యవహారాన్ని పక్కన పెట్టి, పోర్టు వ్యవహారం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఓ మేజర్ పోర్టుని దుగరాజపట్నంలో కేంద్రం నిర్మించాల్సి వుంది. కేంద్రం ఈ విషయమై చేతులెత్తేసింది. దుగరాజపట్నం అయితే వయబులిటీ కాదు.. అన్నారు. దాంతో రామాయపట్నం తెరపైకొచ్చింది. ఆ పోర్టుకే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
కామెడీ ఏంటంటే, ఇదే పోర్టుకి చంద్రబాబు హయాంలోనూ శంకుస్థాపన జరిగింది. అంటే, చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ.. అన్న సినిమా డైలాగు చందాన, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నమాట. ఈ శంకుస్థాపనలకు అయ్యే ఖర్చెంత.? వీటి ద్వారా వృధా అవుతున్న ఖర్చుకి జవాబుదారీ ఎవరు.? మళ్ళీ దీని గురించి చర్చించుకోవాలంటే, ఇదొక ప్రసహనం.
మూడేళ్ళలో తొలి దశ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందట.. రామాయపట్నం పోర్టుకి సంబంధించి. ఇదిగో ఇన్ని ఉద్యోగాలు, అదిగో అంత లాభం.. అంటూ బీభత్సంగా పత్రికల్లో ప్రకటనలు కూడా వచ్చేశాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రామాయపట్నం పోర్టుకి సంబంధించి. గాల్లో మేడలు కట్టడం, అరచేతిలో స్వర్గం చూపించెయ్యడం.. ఇవన్నీ అన్నమాట.
అమరావతి పూర్తయిపోయింది.. మూడు రాజధానులు కట్టేశారు.. జిల్లాకో విమానాశ్రయం వచ్చేసింది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వచ్చేశాయ్.. పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయింది.. కడప స్టీలు ప్లాంటు పూర్తయిపోయింది.. రామాయపట్నం పూర్తయిపోతుంది.. నమ్మేయాల్సిందే.!



