తెలంగాణ
రేషన్ సరుకులు టైంకు చేరాలె

ప్రతినెల నిర్ణీత సమయంలో రేషన్ చౌకధర దుకాణాలకు సరుకులు చేరేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రేషన్ సరఫరా చేయడంలో అలసత్వం వహించడం వల్ల గ్రామీణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, సకాలంలో రేషన్ అందజేయకపోతే కారకులైన వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా నుండి ఎఫ్.సి.ఐ, కార్పొరేషన్ కు అందజేయవలసిన ధాన్యాన్ని కోటా మేరకు అందజేయాలని కలెక్టర్ మిల్లర్లకు సూచించారు. ఇప్పటివరకు కూడా రేషన్ సరఫరా చేయని ట్రాన్స్ పోర్టర్లు ఈ నెల 10వ తేదీ వరకు చేరవేయాలని కలెక్టర్ ఆదేశించారు. పౌరసరఫరాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని రేషన్ సకాలంలో చేరేలా చూడాలన్నారు. రేషన్ సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ లు నిర్లక్ష్యం వహించినట్లయితే లైసెన్స్ లు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్ , జిల్లా పౌర సరఫరాల మేనేజర్ విమల, రైస్ మిల్లర్లు రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.




