ఎలాంటి అభివృద్ధి కాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెపుతున్న వైసిపి ఇందుకు సంబంధించిన వివరాలు బైటకు చెప్పలేక పోతోందని ఆరోపించారు మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావు. గుంటూరు వచ్చిన ఆయన రాజధాని మార్పుపై మీడియాతో మాట్లాడుతూ… అభివృద్ధి కాని అమరావతికన్నా…. తమ భూముల ధరలు మరింతరెట్టింపు చేసుకునేందుకు విశాఖలో రాజధానిని పెట్టేలా చూసారన్నారు. వైసీపీ నేతలంతా విశాఖలో భూములు కొన్నారన్నారని, ఎన్నికల ముందే ఈ విషయమై జగన్ పార్టీ నేతలకు సూచనలు చేయటం వల్లే వారంతా భూములు కొనుగోళ్లు జరిపారని, రాజధాని మారి కర్నూలు వెళితే.. విశాఖలో భూములు కొన్న వారు విషం తాగి చావాల్సి వస్తుందన్నారు. ప్రజలగురించి పట్టించుకోవటం మాని కేవలం చంద్రబాబుపై కోపంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారన్నారన్నది వాస్తవమని చెప్పుకొచ్చారు రాయపాటి.




