ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుముఖ్యాoశాలు
రాష్ట్రపతి పదవి వైనా, గవర్నర్ పదవి వైనా, రబ్బర్ స్టాంప్లా మారాల్సిందే.!

ఎవరు ఆ కుర్చీలో కూర్చుంటేనేమి.? ఎవరైనాసరే, ‘పేపర్ వెయిట్ లేదా రబ్బర్ స్టాంప్’లా మారాల్సిందేనన్న అభిప్రాయమైతే మారదు. గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా.. ఆ రెండు పదవులకు మన ప్రజాస్వామ్యంలో ‘దక్కుతున్న’ గౌరవం అలాంటిది మరి.!
గవర్న్ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు అయితే, దేశానికి ప్రధమ పౌరుడు లేదా పౌరురాలు రాష్ట్రపతి. గత కొంతకాలంగా ఇటు గవర్నర్ పదవిపైనా, అటు రాష్ట్రపతి పదవిపైనా రాజకీయ విమర్శలు సర్వసాధారణమైపోయాయి.
ప్రజాస్వామ్యం బతికుందని చెప్పడానికి నిదర్శనం.. ప్రశ్నించడం. ఆ ప్రశ్న, విమర్శ స్థాయిని దాటేసి.. దూషణల వరకూ వెళ్ళపోయిన దరిమిలా, ఈ పైత్యానికి రాష్ట్రపతి, గవర్నర్ వంటి పదవులూ అతీతం కాకుండా పోయాయి.!
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించిన దరిమిలా, కొత్తగా దేశంలో ఏదో ‘గణనీయమైన మంచి మార్పు’ జరిగిపోతుందనుకోవడం పొరపాటు. దేశంలో మతం పేరుతోనో, ఇంకో పేరుతోనో హింస జరుగుతున్నప్పుడు, రాష్ట్రపతి స్పందించిన దాఖలాల్లేవు. రాష్ట్రాల్లోనూ గవర్నర్లు ‘అది మా పని కాదు’ అన్నట్లు వ్యవహరిస్తుంటారు.
ఒకవేళ గవర్నర్ ఒకింత ‘యాక్టివ్’గా కనిపిస్తే, ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలు.. మరింత అలర్ట్ అవుతాయి. గవర్నర్ పోస్టుల్ని కించపర్చేలా వ్యవహరిస్తుంటాయి కూడా. తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తనకు తగిన గౌరవం దక్కడంలేదంటూ వాపోతున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
అదే సమయంలో, పశ్చిమ బెంగాల్ రాజకీయాన్ని బీజేపీ, గవర్నర్ వ్యవస్థ ద్వారా ఎలా భ్రష్టుపట్టించిందీ చూస్తూనే వున్నాం. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుప్ప కూలడానికి గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ అడ్డం పెట్టుకుని, తమకు అనుకూలంగా పరిస్థితుల్ని మార్చుకుంటోన్న సంగతి తెలిసిందే.
ఇలాంటివాటిని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్రపతి మీద వుంది. కానీ, ఆ రాష్ట్రపతి పదవిలో ఎవరు కూర్చన్నాసరే, వాటిని నివారించలేకపోతున్నారు. కొత్తగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి చేపట్టడం వల్ల అద్భుతాలేమైనా జరుగుతాయని ఆశిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు.




