ముఖ్యాoశాలు
ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

మొట్టమొదటి ఉత్తమ నటుడు రెబల్ స్టారే ! ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి లో చికిత్సపొందుతూ కృష్ణంరాజు కన్నుమూరు. 1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1966లో 'చిలకా గోరింక' చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. 187కు పైగా చిత్రాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. ‘అవేకళ్లు’ చిత్రంలో రెబల్ విలన్ గానూ నిరూపించుకున్నారు. కృష్ణంరాజు 1977,1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో 'తాండ్రపాపారాయుడు' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ అంటే కృష్ణంరాజే. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విలన్ గా ఎదిగి.. మళ్ళీ హీరోగా స్థిరపడిన యాక్షన్ స్టార్ ఆయన. అప్పట్లో మాస్ యాక్షన్ చిత్రాలకు పర్యాయపదంగా నిలిచిన గ్రేట్ స్టార్ ఆయన. ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తన కళ్ళతోనే పలికించి.. మాస్ జనం మదిలో ఒక ప్రత్యేకమైన స్టార్ గా ముద్ర వేయించుకున్నారు కృష్ణంరాజు. 1966లో ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ‘చిలకా గోరింక’ చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు. ఆ తర్వాత పలు చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు. ఒక పక్క హీరోగా నటిస్తూనే .. మరో పక్క విలన్ గా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నారు ఆయన. నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ పలు సూపర్ హిట్ చిత్రాల్ని నిర్మించారు. దాదాపు 200 పైచిలుకు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఆయన 56 సంవత్సరాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో మొట్టమొదటి ఉత్తమనటుడిగా నంది అవార్డు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది. టాలీవుడ్ లో మొదటి సారిగా నంది అవార్డుల్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1964. ఆ ఏడాది అక్కినేని నటించిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి మొదటి సారిగా ఉత్తమ చిత్రం కేటగిరిలో రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారమైన నంది అవార్డు దక్కింది. అక్కడ నుంచి ప్రతీ ఏడాది ఉత్తమ చిత్రాలకు నంది అవార్డుల్ని ప్రదానం చేయడం ఆనవాయితీగా మారింది. అయితే ఉత్తమ నటుడి పురస్కారాల్ని మాత్రం 1977 నుంచి మొదలు పెట్టారు. ఆ ఏడాది మొట్టమొదటి సారిగా ఉత్తమ నటుడి కేటగిరిలో నంది అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా కృష్ణంరాజు చరిత్రలో నిలిచిపోయారు. ఆ ఏడాది కృష్ణంరాజు స్వీయనిర్మాణంలో నటించిన ‘అమరదీపం’ చిత్రంలోని ఆయన అద్భుత నటనకు గాను నంది అవార్డు అందుకున్నారు. ‘తీకనల్’ (నిప్పురవ్వ) మలయాళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ‘అమరదీపం’ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకుడు. నిజానికి ఈ సినిమా కన్నా ముందుగా ‘దీపం’ గా తమిళంలో రీమేక్ అయింది ఈ సినిమా. శివాజీగణేశన్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్టయింది. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ‘అమరదీపం’ చిత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. కోటీశ్వరుడైన కృష్ణ పార్వతిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే పార్వతి మాత్రం శివ ప్రసాద్ ను ప్రేమిస్తుంది. విషయం తెలుసుకున్న కృష్ణ... ప్రసాద్ ను చంపాలని వెళతాడు. అయితే అతడు మరెవరో కాదు.. చిన్నతనంలో తన కారణంగా దూరమైన తన తమ్ముడేనన్న నిజం తెలుస్తుంది. దాంతో పశ్చాత్తాపంతో కుమిలిపోయిన కృష్ణ.. తన తమ్ముడి సంతోషం కోసం విషం తీసుకొని ఆత్మ హత్య చేసుకుంటాడు. అప్పట్లో ఈ సినిమా క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో కదిలించింది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో రెబల్ స్టార్ ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని వెంటాడుతునే ఉంటాయి.




