భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం!
కాంక్రీట్ లిఫ్ట్ రోప్ తెగి కార్మికుడి మృతి.. మరో ఇద్దరికి గాయాలు
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం!

ప్రమాదానికి కారణాలపై అధికారుల విచారణ.. కార్మికుల భద్రతపై ఆందోళన
కరకగూడెం/మణుగూరు, ప్రయత్నం న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ కేంద్రంలో సబ్ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న సిస్ఫాన్ కంపెనీకి చెందిన కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. కాంక్రీట్‌ను పైకి తరలిస్తున్న సమయంలో లిఫ్ట్ రోప్ తెగిపోవడంతో ముగ్గురు కార్మికులకు బలమైన దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన దషువన్ కుంబ్రే అనే కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు తెలిసింది.
రోప్ తెగడంతో ప్రమాదం
బీటీపీఎస్‌లో నిర్మాణ పనుల్లో భాగంగా కాంక్రీట్‌ను పైకి పంపిస్తున్నారు. ఈ క్రమంలో కాంక్రీట్ తరలించే లిఫ్ట్‌కు సంబంధించిన రోప్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో రోప్ బలంగా తగలడంతో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది క్షతగాత్రులను మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మధ్యప్రదేశ్‌కు చెందిన దషువన్ కుంబ్రే అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. గాయపడిన మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
*ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు
ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిసింది. లిఫ్ట్ రోప్ తెగిపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ అమలులో ఉన్న భద్రతా చర్యలు, పరికరాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
*కార్మికుల భద్రతపై ఆందోళన
విద్యుత్ కేంద్రాల్లో నిర్మాణ పనులు నిర్వహించే సమయంలో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కాంక్రీట్‌ను పైకి తరలించే సమయంలో లిఫ్ట్ రోప్ తెగిపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. పరికరాల సామర్థ్యాన్ని ముందుగా తనిఖీ చేశారా? భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు చేశారా? ప్రమాదాన్ని నివారించే చర్యలు తీసుకున్నారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రమాదంతో బీటీపీఎస్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలను వెలుగులోకి తీసుకొచ్చి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక వర్గాలు కోరుతున్నాయి.



