బ్యాలెట్ తో కాంగ్రెస్ ఏం సాధించింది……
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోయిన కాంగ్రెస్

ఇంటర్నెట్ డెస్క్ ప్రయత్నం న్యూస్
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక.. ఈ నాలుగు పెద్ద రాష్ట్రాల్లోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పత్రాలతోనే పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందో తెలుసా?’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా చురకలంటించారు. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు ఉపయోగించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కర్ణాటకలో అధికార పార్టీకి షాక్
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరు ఉపాధ్యాయ, అయిదు పట్టభద్రుల, బిహార్‌లో నాలుగు ఉపాధ్యాయ, నాలుగు పట్టభద్రుల, కర్ణాటకలో రెండు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల, మహారాష్ట్రలో రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల 23న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో కర్ణాటకలో అధికార పార్టీ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు స్థానాల్లోనూ ఓడిపోయింది. భాజపా మూడు స్థానాలను నిలబెట్టుకోగా, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.


