భూ వ్యవహారాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు
రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
భూ వ్యవహారాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు
మంచిరేవుల, మియాపూర్ భూముల విషయంలో భారీ అక్రమాలు జరిగాయి
రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
🚨హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
,
రాష్ట్రంలోని భూ వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మంచిరేవుల గ్రేహౌండ్స్ భూములు, మియాపూర్ భూములు, భూపాలపల్లి అటవీ భూములు, ఐఎంజీ భూముల వ్యవహారాల్లో గత ప్రభుత్వాల కృషిని ప్రస్తుత ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ఓట్ చోరీ కాదని, పక్కా క్రెడిట్ చోరీ అని అన్నారు. మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ మంచిరేవుల గ్రేహౌండ్స్ భూముల కేసు 2010లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓడిపోయిందని, ఆ తర్వాత కేసీఆర్ ఆదేశాలతో 2017 మే 19న దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను నియమించి న్యాయపోరాటం ప్రారంభించామని తెలిపారు. 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో, 2023 ఆగస్టు 1న సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు. 142 ఎకరాలు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తుచేశారు.
మంచిరేవుల భూములపై తీవ్ర ఆరోపణలు
గ్రేహౌండ్స్‌కు చెందిన 30 ఏళ్ల ప్రహరీ గోడను రాత్రికి రాత్రే కూల్చివేసి, రెండు రోజుల్లోనే లోపల కొత్త గోడ నిర్మించారని హరీశ్ రావు ఆరోపించారు. 10 ఎకరాల 10 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు వదిలేశారని విమర్శించారు. గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 8886/2026 ద్వారా జీరో వాల్యూ రిజిస్ట్రేషన్ జరిగిందని, రూ.45.39 కోట్ల మార్కెట్ విలువ ఉన్న భూమికి కన్సిడరేషన్ విలువ సున్నాగా చూపించారని ఆరోపించారు.
7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, డ్రీమ్ వ్యాలీ సంతోష్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మరో 20 రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు. ఎకరం రూ.100 కోట్లు పలికే ప్రాంతంలో సుమారు రూ.1,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టారని ఆరోపించారు. భూభారతి రికార్డుల్లో ఇప్పటికీ ఆ భూమి గ్రేహౌండ్స్ పోలీస్ శాఖ పేరు మీదే ఉందని తెలిపారు.
మంచిరేవుల భూముల వ్యవహారంలో మొత్తం రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన హరీశ్ రావు, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన మరో 10 ఎకరాల భూమికి సంబంధించిన నోటిఫికేషన్ రద్దుపై అప్పీల్‌కు వెళ్లలేదని, కొత్త నోటిఫికేషన్ ఇవ్వవచ్చని తీర్పులోని 134వ పేరాలో పేర్కొన్నప్పటికీ మూడు నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.


