వలస విధానంపై మెత్తబడిన ట్రంప్…..వలస విధానం మరీ కఠినంగా ఉందేమో
ఇరాన్‌తో యుద్ధం కూడా ఓటమికి కారణమేనని అంగీకారం.. డెమోక్రాట్లతో రాజీకి సిద్ధమని వెల్లడి
వలస విధానం మరీ కఠినంగా ఉందేమో
మధ్యంతర ఎన్నికల ఓటమిపై ట్రంప్ ఆత్మపరిశీలన!
ఇరాన్‌తో యుద్ధం కూడా ఓటమికి కారణమేనని అంగీకారం.. డెమోక్రాట్లతో రాజీకి సిద్ధమని వెల్లడి
అమెరికా: మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిలో మార్పు కనిపిస్తున్నారు. ముఖ్యంగా వలస విధానంపై పునరాలోచనకు సిద్ధమయ్యారు. తన విధానం కొంత కఠినంగా ఉందేమోనని అంగీకరించారు. సీబీఎస్ ఛానల్ ప్రసారం చేసే ‘60 మినిట్స్’ కార్యక్రమానికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు.
వలస విధానంపై మెత్తబడిన ట్రంప్
అమెరికాలో ఏళ్లుగా నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా వెనక్కి పంపించడంపై కొంత వ్యతిరేకత వ్యక్తమైందని ట్రంప్ అంగీకరించారు. సరిహద్దు భద్రత, నేరస్థుల బహిష్కరణ విషయంలో తనకు ప్రజలు మంచి మార్కులు ఇచ్చారని చెబుతూనే, వలస విధానం కొంత కఠినంగా ఉందేమోనని వ్యాఖ్యానించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడని వలసదారుల విషయంలో డెమోక్రాట్లతో కలిసి రాజీ మార్గాన్ని అన్వేషించేందుకు సిద్ధమని తెలిపారు.
ఇరాన్ యుద్ధం కూడా ఓటమికి కారణం
మధ్యంతర ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఇరాన్‌తో యుద్ధం కూడా ఒక కారణమన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభిప్రాయంతో ట్రంప్ ఏకీభవించారు. అయితే ఇరాన్ అణ్వస్త్ర దేశంగా మారకుండా అడ్డుకోవడం చారిత్రక అవసరమని సమర్థించుకున్నారు. దీర్ఘకాలంలో తన నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తారని పేర్కొన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశామని, హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచామని వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం సమీపంలో ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదని మరోసారి వ్యాఖ్యానించారు.
కేబినెట్‌లో మార్పులకు సంకేతాలు
తన కేబినెట్‌లో కొందరిని మార్చే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. “కొన్ని మార్పులు చేయొచ్చు” అని పేర్కొన్నారు. ఏఐ రంగంలో చైనాతో పోటీ అత్యంత కీలకమని, ఈ పోటీలో అమెరికానే విజయం సాధించాలని అన్నారు.
మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.




