*నవంబర్ 1న పురపాలక ఎన్నికల పోలింగ్*
అమరావతి,
ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగనున్న వంద పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరించనుంది. పోలీసు బందోబస్తుతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
1,904 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తింపు
రాష్ట్రంలోని 671 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద 3,355 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. మరో 1,233 సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద 4,943 మంది పోలీసులను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.
1.03 కోట్ల మంది ఓటర్ల కోసం ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా 12,244 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సుమారు 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని మున్సిపల్ కార్యాలయాలకు తరలించారు. అక్టోబర్ 31న ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరవేయనున్నారు.


