టికెట్ చిల్లర వివాదం.. ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి!
ప్రవళిక మృతికి నిరసనగా నేడు మణుగూరు డిపో బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు
టికెట్ చిల్లర వివాదం.. ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి!


మణుగూరు, ప్రయత్నం న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామ సమీపంలో గత నెల 25వ తేదీన ఆర్టీసీ బస్సులో చోటుచేసుకున్న టికెట్ చిల్లర వివాదం విషాదాంతంగా మారింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక మంగళవారం రాత్రి మృతి చెందారు.
టికెట్ చిల్లర విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో జరిగిన ఘటనలో కండక్టర్ ప్రవళిక బస్సు టైర్ల కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కండక్టర్ ప్రవళిక మృతి ఆర్టీసీ కార్మిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడంతో తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
*నేడు మణుగూరు డిపో బంద్‌కు పిలుపు
ప్రవళిక మృతికి నిరసనగా, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాలు నవంబర్ 4వ తేదీన మణుగూరు డిపో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో డిపో పరిధిలో బస్సు సర్వీసుల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉంది.
కండక్టర్ ప్రవళిక మృతికి కార్మిక సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


