నీటి హక్కులపై ఆరోపణలు కాదు.. నిర్మాణాత్మక ఆలోచనలే అవసరం
తెలంగాణ సస్యశ్యామలం కావడమే మా లక్ష్యం: కాట్రగడ్డ ప్రసూన
నీటి హక్కులపై ఆరోపణలు కాదు.. నిర్మాణాత్మక ఆలోచనలే అవసరం
తెలం
గాణ సస్యశ్యామలం కావడమే మా ల
క్ష్యం: కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి, ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికీ శాశ్వత తాగునీటి భద్రత కల్పించడమే అందరి లక్ష్యం కావాలని మాజీ ఎమ్మెల్యే, టీటీడీపీ ఉపాధ్యక్షురాలు, తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, అదే సమయంలో ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులకు పేర్లు పెట్టడం, శంకుస్థాపనలు చేయడం అభివృద్ధి కాదని, చివరి ఆయకట్టు రైతు పొలానికి నీరు చేరినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదన్నారు. 2015 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టుపై సుమారు రూ.27,513 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు, దాదాపు 4 వేల ఎకరాల భూసేకరణ, పంపిణీ కాలువల నిర్మాణం పూర్తికాలేదని విమర్శించారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పినప్పటికీ, అందుకు అవసరమైన వ్యవస్థ సిద్ధం కాలేదని పేర్కొన్నారు. కీలక అనుమతులు కూడా పూర్తిస్థాయిలో రాకముందే ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని చెప్పడం రైతులను తప్పుదోవ పట్టించడమేనన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన ప్రజాధనానికి అనుగుణంగా రైతులకు ఎంత ప్రయోజనం చేకూరిందో గత పాలకులు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తూ కాలం గడపకుండా, తెలంగాణలో అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల భవిష్యత్తు తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు రాష్ట్రాల రైతులు బాగుండాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులు ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలనే నిర్మాణాత్మక ఆలోచన చంద్రబాబు నాయుడిదని కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసం, అంతర్గత విభేదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు పేరును వివాదాల్లోకి లాగడం తగదన్నారు.
తెలంగాణ నీటి హక్కులు, రైతుల ప్రయోజనాల విషయంలో తమ వైఖరి స్పష్టమని, ఏ చిన్న అన్యాయం జరిగినా ప్రశ్నిస్తామని తెలిపారు. తెలంగాణకు ప్రస్తుతం కావాల్సింది ఆరోపణల రాజకీయాలు కాదని, నిర్మాణాత్మక అభివృద్ధి, ఆచరణాత్మక పరిష్కారాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కాట్రగడ్డ ప్రసూన పిలుపునిచ్చారు.


