రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’.

ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే
నా నుంచి పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది : ఎస్వీ కృష్ణారెడ్డి
యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`మృణాళిని జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేసి ట్రైలర్, టీజర్‌లను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్.వి. కృష్ణారెడ్డి అనే ఈ టైటిల్ కార్డు చూసి చాలా రోజులు అయ్యింది. అది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలు కమర్షియల్ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి. ట్రైలర్ చూసిన తర్వాత కృష్ణారెడ్డిగారు కమ్‌బ్యాక్ అని గట్టిగా చెప్పవచ్చు. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు అన్నారు.




