మూడు దశాబ్దాల కల.. ముఖ్యమంత్రి జన్మదిన వేళ సాకారం..!!
* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన కానుకగా పెద్దగూడెం పేదలకు ఇందిరమ్మ ఇంటి స్థలాల శాశ్వత పట్టాలు..
మూడు దశాబ్దాల నిరీక్షణ.. ఎన్నో ఏళ్ల పోరాటం.. తరతరాలుగా మనసులో దాచుకున్న సొంతింటి కల.. ఎట్టకేలకు సాకారమైంది. పెద్దగూడెం గ్రామ నిరుపేద కుటుంబాల జీవితాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదినం కొత్త వెలుగులు నింపింది. ఏళ్ల తరబడి హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇందిరమ్మ ఇంటి స్థలాల శాశ్వత పట్టాలు అందించడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పేద కుటుంబాలకు అందిన ఈ పట్టాలు వారికి చిరకాలం గుర్తుండిపోయే కానుకగా నిలిచాయి.
పెద్దగూడెం గ్రామంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ, వాటికి సంబంధించిన అధికారిక పట్టాలు, ప్రొసీడింగ్స్ అందించకపోవడంతో లబ్ధిదారులకు పూర్తిస్థాయి హక్కులు దక్కలేదు. మరల వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సైతం ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో పేదలు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో తమకు కేటాయించిన స్థలాలు ఎక్కడ చేజారిపోతాయోనని పేద కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. సొంతింటి కోసం ఆశగా ఎదురుచూసిన వారి కల నెరవేరకుండానే కాలం గడిచిపోయింది.
ఈ పరిస్థితుల్లో పెద్దగూడెం గ్రామ పేదల సమస్యను గుర్తించిన వనపర్తి డీసీసీ చీఫ్ శివసేనరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, పేదలకు న్యాయం జరిగేలా పట్టాల పంపిణీకి అవసరమైన చర్యల కోసం పట్టుదలతో కృషి చేశారు. లబ్ధిదారులకు అండగా నిలుస్తూ సమస్యను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారం, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక శ్రద్ధ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. ఫలితంగా అర్హులైన పేద కుటుంబాలకు ఇంటి స్థలాల శాశ్వత పట్టాలు అందించే ప్రక్రియ కార్యరూపం దాల్చింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం రోజున తమ చేతుల్లో శాశ్వత పట్టాలు అందుకోవడంతో పెద్దగూడెం గ్రామ ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకప్పుడు తమకు కేటాయించిన స్థలాలపై హక్కులు కోల్పోతామేమోనని ఆందోళన చెందిన కుటుంబాలు.. ఇప్పుడు అదే స్థలాలకు శాశ్వత హక్కులు పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తమ పిల్లలకు ఒక చిరునామా, తమ కుటుంబాలకు ఒక భరోసా, సొంతింటి నిర్మాణానికి ఒక నమ్మకం కలిగిందని భావోద్వేగానికి గురవుతున్నారు.
మూడు దశాబ్దాలుగా పరిష్కారం కాని తమ సమస్యకు చొరవ తీసుకుని ముగింపు పలికిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి గ్రామ ప్రజలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ చిరకాల స్వప్నం సాకారం కావడానికి కృషి చేసిన డీసీసీ చీఫ్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జన్మదిన వేళ తమ జీవితాల్లో ఇంతటి ఆనందం నిండటం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.
పేదవాడి సొంతింటి కల నెరవేరడం కంటే గొప్ప సంతోషం మరొకటి లేదని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపడమే ప్రజాపాలనకు నిజమైన అర్థమని ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. 


