తెలుగు చిత్ర పరిశ్రమలో వారానికో సినిమా విడుదలవుతుంది. చిన్న సినిమాలకు కలెక్షన్ల అంటూ పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ పెద్ద సినిమాలు విడుదలయితేనే కలెక్షన్లలో అగ్ర కథనాయకుల స్టామినాతో చిన్న సినిమాలు బతకని పరిస్థితి. అయితే ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలతో వార్ పెద్దగానే నడుస్తోంది. ఈ పరిస్థితితో చిన్న చిత్రాలు నలిగిపోతున్నాయి. రోజురోజుకూ కలెక్షన్ల సునామీ అంటూ కొత్త కొత్త లెక్కలు చెపుతున్నారు. ఎవరికి వాళ్లు కలెక్షన్ల ఫిగర్లను ఇష్టానుసారం వేసుకుంటూ.. అవతలి వాళ్లవి ఫేక్ కలెక్షన్లని ప్రచారం చేస్తూ.. అసలు వసూళ్లెంతో తెలియని అయోమయ స్థితిలోకి అభిమానుల్ని నెట్టేస్తున్నారు. ఇప్పుడు వాస్తవ వసూళ్లు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
ఇప్పటికే పోస్టర్ల మీద వసూళ్ల ఫిగర్ల విషయంలో టాలీవుడ్ నిర్మాతలు తమ స్థాయికి తగని విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అగ్ర కథానాయకుల్లో మహేశ్ సినిమాలకు మరీ హైప్ ఎక్కువ అయితే ఈ సంక్రాంతికి మహేశ్‌బాబు సరిలేరు నీకేవ్వరు తో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నాడు. ఈచిత్రం జనవరి12న విడదలైంది. అంతేగాకుండా జనవరి 13న అల్లు అర్జున్ అల.. వైకుంఠపురం చిత్రంతో కలెక్షన్ల వార్ స్టార్టయింది.
సంక్రాంతి సినిమాలు పరిస్థితిని మరింత దిగజార్చేశాయి. మహేష్ గత కొన్ని సినిమాల నుంచి పోస్టర్ల విషయంలో విపరీతమైన హంగామా కనిపిస్తోంది. అతడి సినిమాలకు కలెక్షన్ల ఫిగర్లు బాగా ఎక్కువ చేసి చూపిస్తున్న వైనంపై చాలా చర్చ నడిచింది. ‘సరిలేరు..’కు మరీ శ్రుతి మించి వేస్తున్నారు పోస్టర్లు. వాళ్లకు మేమేం తక్కువ అన్నట్లు ‘అల వైకుంఠపురములో’ టీం ఇంకా హైప్ చేసి చూపిస్తోంది తమ సినిమా కలెక్షన్ల ఫిగర్లను. ఈ పోటీ జనాలకు చికాకు తెప్పిస్తోంది. ఈ పరిస్థితి రోజురోజుకూ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత దిగజార్చేలా ఉందని కొందరు వాదిస్తున్నారు.
దాసరి నారాయణరావు లాంటి వారు చిన్న సినిమాలను బతికించడానికి ఎంతగానో పూనుకున్నారు. కాని పెద్ద సినిమాల విడుదలప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి దాపురించింది. అగ్ర కథనాయకుల సినిమాలను దృష్టిలో ఉంచుకొనే ఈసారి చిన్న సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితిని ఊహించుకుంటేనే తెలుస్తోంది. చిన్నసినిమాలను నిలువునా పెద్ద సినిమాలు ముంచేస్తున్నాయని తెలుసుకోవచ్చు. దీనికితోడు పెద్ద సినిమాలకు వచ్చే పొంతనలేని కలెక్షన్లతో చిన్న సినిమా చతికిలబడుతుంది.
ఇప్పటికైనా సినీ పెద్దలు దీనిపై కుర్చోని పొంతన లేని వసూళ్లపై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్నీ పెద్ద సినిమాలకు ఇలాంటి పరిస్థితే కొనసాగితే చిన్న సినిమాలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది.




