Allవార్తలు

‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’

అమ్మ అంటే ఈ ప్ర‌పంచంలో న‌చ్చ‌న‌ది ఎవ‌రికి అంద‌రికీ అమ్మంటే ప్రాణం. అందుకే ఆమె పైన సినిమాలు తీసినా, ఎన్ని పాట‌లు రాసినా అవ‌న్నీ హిట్ ఖాతాలోనే చేర‌తాయి. మన గీత రచయితల్లో చాలామంది అమ్మ పాటలు రాశారు. వాళ్లలో ముందు చెప్పుకోవాల్సింది జూనియర్‌ సముద్రాల గురించి! అరవై ఏళ్ల కిందటి ‘పాండురంగ మాహాత్మ్యం’ కోసం ఆయన రాసిన ‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కన్నూమిన్నూ కానక కన్నవాళ్లనే కాలదన్ని, కాళ్లు పోగొట్టుకుంటాడు పుండరీకుడు. అప్పుడు గానీ, చేసిన తప్పు తెలిసిరాదు. వెంటనే కన్నీళ్లతో అమ్మానాన్నల కాళ్లు కడుగుతాడు. ఈ సన్నివేశానికి ఆర్ద్రత నిండిన పాట రాశారు జూనియర్‌ సముద్రాల. ‘పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి- మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసినా- ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితి- తలచకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మా’ అంటూ ఆ కొడుకుతో పాడించారాయన. పశ్చాత్తాపంతో కుమిలిపోయే అతని హృదయాన్ని ‘మారిపోతినమ్మా నా గతి ఎరిగితినమ్మా- నీ మాట దాటనమ్మా ఒకమారు కనరమ్మా’ అన్న మాటలతో ఆవిష్కరించారు. ‘మాతా పిత పాదసేవే మాధవసేవ’ అనే సందేశాన్నందించే ఈ గీతం ఓ ఆణిముత్యం.

      ఇటీవల వచ్చిన ‘పాండురంగడు’ చిత్రంలో ఇదే సందర్భానికి సుద్దాల అశోక్‌తేజ పాట రాశారు. ‘మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను’ అంటూ ఇది ప్రారంభమవుతుంది. ‘అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవి- నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని- నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని- బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని- తెలియనైతి తల్లీ, ఎరుగనైతినమ్మా…’ అంటూ తల్లి పాదాలను శరణువేడతాడు ఆ కొడుకు. వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు రచయితలు ఒకే సందర్భానికి పాట రాయడం అరుదు. అలాంటి అరుదైన సన్నివేశానికి పునాది అయిన తల్లీబిడ్డల పేగుబంధాన్ని ఆ ఇద్దరూ అంతే బాగా  అక్షరీకరించారు. ఇక అశోక్‌తేజ రాసిన మరో అమ్మపాటా అర్థవంతమైందే. ‘సువ్వీ సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా- నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ’ అంటూ మొదలయ్యే ఈ గీతం (‘లోఫర్‌’ చిత్రంలో)… చిన్ననాడే తల్లికి దూరమైన ఓ కొడుకు ఆవేదనకు అక్షరరూపం. ఇలా  మ‌రెన్నో పాట‌లు ఉన్నాయి. సినీ క‌వుల క‌లం నుంచి వాలుజ‌రిన పాట‌లు మ‌రెన్నో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker