పశువైద్యశాల నిర్లక్ష్యానికి మూగజీవం బలి!
సకాలంలో వైద్యం అందక ఆవు మృతి.. రైతుకు రూ.1.20 లక్షల నష్టం

పశువైద్యశాల నిర్లక్ష్యానికి మూగజీవం బలి!
సకాలంలో వైద్యం అందక ఆవు మృతి.. రైతుకు రూ.1.20 లక్షల నష్టం
మూడు నాలుగు సార్లు ఆసుపత్రికి వెళ్లినా అందుబాటులో లేని వైద్యురాలు
ఫోన్ చేసినా స్పందన కరువు.. తాళం వేసి దర్శనమిస్తున్న పశువైద్యశాల
కరకగూడెం, ప్రయత్నం న్యూస్:
రైతుల పశుసంపదకు రక్షణగా నిలవాల్సిన పశువైద్యశాలే అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పశువులకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన వైద్య సేవలు తలుపులు మూసుకోవడంతో ఓ మూగజీవం ప్రాణాలు కోల్పోయింది. వైద్యురాలి కోసం ఎన్నిసార్లు ఆసుపత్రి చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, ఫోన్ చేసినా కనీస స్పందన కరువైందని మోతె గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకన్న కన్నీరుమున్నీరవుతున్నారు. సకాలంలో వైద్యం అందక తన ఆవు మృతి చెందడంతో సుమారు రూ.1.20 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజులుగా తన ఆవుకు అనారోగ్యం కలగడంతో చికిత్స కోసం నిన్న మంగళవారం రోజున మూడు నాలుగు సార్లు పశువైద్యశాలకు వెళ్లినా ప్రతిసారీ తాళం వేసి దర్శనమిచ్చిందని తెలిపారు. అత్యవసర సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆవుకు సకాలంలో చికిత్స అందించలేకపోయానని వాపోయారు. చివరకు వైద్యం అందక ఈరోజు ఉదయం 8:30 సమయంలో తన ఆవు మృత్యువాత పడటంతో తన కుటుంబానికి రూ.1.20 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఒక్కరోజు సమస్య కాదని, గతంలోనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని వెంకన్న ఆరోపించారు. గతంలో తన ఆవు అనారోగ్యానికి గురైనప్పుడు పశువైద్యశాలకు వెళ్లగా ఆసుపత్రికి తాళం వేసి ఉందని, వైద్యురాలికి ఫోన్ చేయగా ఇంటికి రాలేనని, ఆవును బొలెరో వాహనంలో ఆసుపత్రికి తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు. సకాలంలో వైద్యం అందక అప్పట్లోనూ తన ఆవును కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల మరో ఆవుకు పొదుగు వాపు రావడంతో చికిత్స కోసం పశువైద్యశాల చుట్టూ పదేపదే తిరిగినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా 10 నుంచి 15 రోజుల వరకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. చివరకు ఒకసారి వచ్చి ఇంజక్షన్ వేసి వెళ్లిపోయారని, ఆ తర్వాత అవసరమైన తదుపరి డోసులు ఇచ్చేందుకు కూడా వైద్యురాలు అందుబాటులోకి రాలేదని తెలిపారు. పశువులకు అవసరమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాల్సింది పోయి, బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాలంటూ చీటీలు రాసి ఇస్తున్నారని మండిపడ్డారు.
ఆసుపత్రి ఉందా.. సేవలు ఎక్కడ?
ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పశువైద్యశాలలు రైతులకు సేవలందించాల్సింది పోయి తాళాలు వేసి కనిపిస్తుండటం పట్ల గ్రామీణ రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పశువులే జీవనాధారంగా బతికే రైతులకు ఒక్క మూగజీవం మృతి చెందినా కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాంటిది అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే రైతులు ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించరా?
పశువైద్యశాల పనితీరుపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు. వైద్యురాలు విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయా? అత్యవసర సమయాల్లో పశువులకు వైద్య సేవలు అందుతున్నాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పశువైద్యశాలను నిత్యం అందుబాటులో ఉంచి రైతులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆవుల వెంకన్నతో పాటు స్థానిక రైతులు కోరుతున్నారు.

